Salaar2: ‘సలార్‌2’పై వైరలవుతోన్న వార్తలో నిజమెంత.. ప్రశాంత్‌ నీల్‌ ఏం చెప్పారంటే!

సోషల్‌ మీడియాలో ‘సలార్‌2’కు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. దీన్ని ఖండిస్తూ ప్రభాస్ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. 

Updated : 25 May 2024 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోన్న ఓ వార్త ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియులను కలవరపెడుతోంది. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ సీక్వెల్‌ ఆగిపోయిందంటూ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ప్రభాస్‌కు, ప్రశాంత్ నీల్‌కు (prashanth neel) మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని అందుకే ‘పార్ట్‌ 2’ అటకెక్కిందని ఆ వార్తల సారాంశం. అయితే, ఈ సీక్వెల్‌ ఆగిపోదంటూ ప్రభాస్‌ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నారు. గతంలో ఈ భారీ సీక్వెల్‌ గురించి ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడిన వీడియోలను, నటీనటులు ‘సలార్‌2’ షూటింగ్‌పై ఇచ్చిన అప్‌డేట్‌లను షేర్‌ చేస్తున్నారు. 

‘సలార్‌2’ (Salaar 2) సెట్స్‌ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రశాంత్‌నీల్‌ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. త్వరలోనే దీని షూటింగ్‌ కూడా ప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘కేజీఎఫ్‌2’ షూటింగ్‌ పూర్తవగానే ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ పనులు ప్రారంభించారు. అందుకే వీటి సీక్వెల్స్‌ తెరకెక్కించే ముందు ఆయన కొంత విరామం తీసుకోనున్నట్లు ఇంతకుముందు చెప్పారు. ‘సలార్‌’ విడుదలై కూడా ఐదు నెలలు దాటింది. ఇక ప్రశాంత్ నీల్ త్వరలోనే ‘సలార్‌2’ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్‌ (Prabhas) కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నందున మొదట ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్‌-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’.. అన్ని ప్రాంతాల్లోనూ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే పార్ట్‌-2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకున్న ‘సలార్‌ 2’ ఆగిపోయే ప్రశ్నే లేదంటున్నారు సినీ పండితులు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ‘సలార్‌’ కథను ప్రశాంత్ నీల్‌ 15 ఏళ్ల క్రితమే అనుకున్నారు. అప్పటినుంచి దానికి సంబంధించిన వర్క్‌ చేసుకుంటూ వచ్చారాయన. మొదటి భాగాన్ని ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ పేరుతో విడుదల చేయగా రెండో భాగాన్ని ‘సలార్‌: శౌర్యంగపర్వం’ పేరుతో ప్రేక్షకులకు అందించనున్నట్లు గతంలోనే స్పష్టంచేశారు. పార్ట్‌-1తో పోలిస్తే రెండో దాంట్లో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ల మధ్య అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఖాన్సార్‌ కుర్చీ కోసం జరిగే రాజకీయాలు, మలుపులు, యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవల సీక్వెల్‌ గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్‌ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇన్ని అప్‌డేట్ల మధ్య సలార్‌2పై వస్తోన్న వార్తలు నిజాలు కావని అర్థమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు