Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్‌-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!

‘సలార్‌’ పార్ట్‌-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్‌-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది?

Updated : 23 Jan 2024 13:40 IST

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ (Salaar: Part 1-Ceasefire). డిసెంబరు 22న వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్‌ అవుతూ టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రభాస్‌ యాక్షన్‌, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘సలార్: పార్ట్‌-1’ చూసిన వారందరూ సీక్వెల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘సలార్‌ పార్ట్‌-2: శౌర్యాంగ పర్వం’ పేరుతో రాబోయే చిత్రం ఎలా ఉంటుందా? అన్న ఉత్కంఠ ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉంది. మరి రెండో భాగాన్ని ఎందుకు చూడాలి? ఏయే ప్రశ్నలకు అందులో సమాధానం దొరుకుతుంది?

 • ఖాన్సార్‌లో ఉన్న వాళ్లు ఏడేళ్ల నుంచి కృష్ణకాంత్‌ (రవి భట్‌), అతడి కుమార్తె ఆద్య (శ్రుతిహాసన్‌) కోసం ఎందుకు వెతుకుతున్నారు? కర్త మన్నార్‌ (జగపతిబాబు)కు అత్యంత సన్నిహితుడైన కృష్ణకాంత్‌ చేసిన తప్పు ఏంటి? ఖాన్సార్‌ను వదిలి విదేశాలకు పారిపోవడానికి కారణమేంటి?ఆద్య తల్లి ఎవరు?
 • కృష్ణకాంత్‌కు బిలాల్‌ (మైమ్‌ గోపి) చేసిన వాగ్దానం?
 • ‘ఏడేళ్ల నుంచి ఇదే మాదిరిగా చీకట్లో వణుకుతూ పగతో కూర్చొని ఉన్నావ్‌’ అని ఓబులమ్మ (ఝాన్సీ) రాధారమా (శ్రియారెడ్డి)తో అంటుంది. ఆమె అలా ఉండటానికి కారణం?తన భర్త భారవ శౌర్యాంగ అని తెలిసిన తర్వాత రాధారమ తీసుకున్న నిర్ణయం ఏంటి?
 • శౌర్యాంగ తెగ నాయకుడు ధారా చనిపోయాడని సలార్‌-1లో చెప్పారు. కానీ, చంపిన ఆధారం ఎక్కడా చూపించలేదు. ‘కేజీయఫ్‌’లోనూ మొదట అధీర చనిపోయినట్లు చూపించి చివరిలో అతడు మళ్లీ తిరిగి వస్తున్నట్లు చెప్పారు. ధారా నిజంగా చనిపోలేదా?ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాడు?
 • కర్త రాజమన్నార్‌ (జగపతిబాబు)కు ముందు అతడి తండ్రి శివమన్నార్‌ ఖాన్సార్‌ను పాలించాడు. ఆ పాత్రలోనూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కనిపించారు. మరి ధారాగా ప్రభాస్‌నే చూపిస్తారా?
 • ‘ఊరు నుంచి ఊరు.. ఏడేళ్లుగా పరిగెడుతూనే ఉన్నాం’ అని బిలాల్‌తో దేవా తల్లి ఈశ్వరిరావు అంటుంది. ఖాన్సార్‌కు వెళ్లిన దేవాను తీసుకుని ఆమె తల్లి పారిపోయి రావడానికి, ఎవరికీ కనపడకుండా తిరగడానికి కారణం ఏమై ఉంటుంది?
 • ఖాన్సార్‌ మనుషులు ఆద్యను తీసుకెళ్తున్నప్పుడు ఆమెను కాపాడటానికి దేవా.. మెషీన్‌ గన్స్‌, లాంఛర్లతో విరుచుకుపడతాడు. మరి ఖాన్సార్‌ నుంచి వచ్చేసిన తర్వాత దేవా ఏం చేశాడు? అతడికి ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
 • దేవా ‘సలార్‌’ అయిన తర్వాత ఖాన్సార్‌లో ఏం చేశాడు? వరదాను చంపడానికి చేతులు కలిపిన అతడి మామయ్య ఓం మన్నార్‌ (దేవరాజ్‌), రుద్ర మన్నార్‌ (రామచంద్రరాజు)లను ఎలా ఎదుర్కొన్నాడు?
 • అసలు దేవా ఎందుకు ప్రత్యేకంగా సీల్‌ను క్రియేట్‌ చేశాడు? ఆ సీల్‌ ఉన్న దేన్నైనా ఆపే వాళ్లను చంపుతామనే నిబంధన ఎందుకు పెట్టాడు?
 • సీజ్‌ ఫైర్‌ ప్రకటించిన తర్వాత రుద్ర.. పండిట్‌ను పిలిపిస్తాడు. ఇంతకీ ఈ పండిట్‌ ఎవరు? ‘పండిట్‌ ఏం చేయగలడో నాకు తెలుసు’ అని కర్త రాజమన్నార్‌ (జగపతిబాబు) అంటాడు. అతడిలో అంతటి క్రూరుడు ఉన్నాడా?పండిట్‌ పాత్రను పూర్తిగా రివీల్‌ చేయకుండా పార్ట్‌-2 కోసం అట్టిపెట్టారా?

 • ‘కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు.. నా కళ్ల ముందున్నదంతా నాకు కావాలి’ అని దేవాతో వరద అంటాడు.  మరి వరద కోరికను దేవా ఎలా సాకారం చేశాడు?
 • కర్త రాజమన్నార్‌ను ఎదుర్కోవడానికి ఘనియార్‌ తెగకు చెందిన వాలి (బ్రహ్మాజీ) పెద్ద ఆయుధాల డీల్‌ చేస్తాడు. తన తోటి తెగవారైన చీకా, గురంగ్‌లతో కలిసి వాలి ఏం ప్లాన్‌ చేశాడు? దేవా, వరద.. వాలిని ఎలా ఎదుర్కొన్నారు?
 • అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న. దేవా.. ‘శౌర్యంగ’ అని తెలిసినా కూడా వరద రాజమన్నార్‌ అతడిని తన ‘సలార్‌’గా ప్రకటిస్తాడు. మరి దేవా, వరద ఎందుకు శత్రువులుగా  మారారు?ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్లు బద్ధ శత్రువులుగా మారడం వెనుక ఏం జరిగింది? సింహాసనం మీద కూర్చొనే అర్హత దేవాకు ఉందని తెలిసిందా?ఒకవేళ తెలిసినా వదిలేసుకుని ఖాన్సార్‌ నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి?
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని