Salaar: ‘సలార్‌’పై వదంతులు.. మౌనం వీడిన నిర్మాత

‘సలార్‌’(Salaar)పై వస్తోన్న పలు వదంతులపై చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు. ఆయా వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 

Updated : 14 Dec 2023 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘సలార్‌’ (Salaar) ఒకటి. ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ (Prasanth Neel) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 22న ఇది విడుదల కానుంది. ఈ సినిమాలో యశ్‌ (Yash) నటిస్తున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే, ‘కేజీయఫ్‌’కు ‘సలార్‌’కు లింక్‌ ఉందంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆయా కథనాలపై ‘సలార్‌’ సింగర్‌ తీర్థ సుభాష్‌ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడంలేదు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ స్పందించారు. 

‘‘సలార్‌’ చిత్రానికి ‘కేజీయఫ్‌’కు ఎలాంటి సంబంధం లేదని మా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ సినిమాలో యశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకూ మా చిత్రంలో ఎలాంటి అతిథి పాత్రలు లేవు. కాబట్టి ఆయా వార్తల్లో నిజం లేదు’’ అని ఆయన తెలిపారు.

విజయ్‌ దేవరకొండపై అసభ్యకర వీడియో.. యూట్యూబర్‌ అరెస్ట్‌

ఈ వదంతుల వెనుక ఉన్న కారణం ఏమిటంటే: గాయని తీర్థ సుభాష్‌ ఇటీవల ‘సలార్‌’ చిత్రంలో ఓ పాట ఆలపించింది. ఈ క్రమంలోనే ఆమె గత కొన్నిరోజుల క్రితం మీడియాతో మాట్లాడింది. ఇందులో ప్రభాస్‌తోపాటు యశ్‌ కూడా ఉన్నారని చెప్పింది. ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై ఆమె స్పష్టతనిస్తూ.. ‘‘కేజీఎఫ్‌’ సినిమాను నేను చాలా సార్లు చూశా. అందులో యశ్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో మ్యూజిక్‌ గురించి మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. దాంతో ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ‘కేజీఎఫ్‌’ గుర్తొచ్చి యశ్‌ పేరు చెప్పానంతే.’’ అని బుధవారం ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘ఆదిపురుష్‌’ తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న చిత్రం ‘సలార్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాల్లో దీనిని విడుదల చేయనున్నారు. మొదటి భాగాన్ని ‘సలార్‌ పార్ట్‌1 సీజ్‌ ఫైర్‌’ పేరుతో డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ దీనిని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని