Sandeep Reddy Vanga: మహేశ్‌బాబుకు ‘యానిమల్‌’ కథ చెప్పలేదు కానీ..: సందీప్‌ రెడ్డి వంగా క్లారిటీ

‘యానిమల్‌’ ప్రెస్‌మీట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న చిత్రబృందం పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Updated : 27 Nov 2023 19:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథను సందీప్‌ మొదట మహేశ్‌బాబు (Mahesh Babu)కు చెప్పారని.. కాకపోతే అది ప్రారంభంకాలేదని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా సందీప్‌ స్పందించారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ‘‘మహేశ్‌బాబుకు ‘డెవిల్‌’ అనే కథ చెప్పాను. ‘యానిమల్‌’ కథ కాదు. కాకపోతే రెండు కథలూ కాస్త ఒకేలా ఉంటాయి. ‘యానిమల్‌’లో మీరు ఇప్పటివరకూ చూసిన దాని కంటే ఆ కథలో మరింత ఎక్కువ హింస ఉంటుంది. కాకపోతే మా ఇద్దరి కాంబో కుదరలేదు’’ అని ఆయన చెప్పారు.

‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’.. ఇలా నిర్మాత భూషణ్‌ కుమార్‌తో టీమ్‌ అప్‌ కావడం ఎలా ఉంది?

సందీప్‌: సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘యానిమల్‌’కు విశేష స్పందన లభించింది. దానిపై మీ ఫీలింగ్‌ ఏమిటి? 

భూషణ్‌ కుమార్‌: ఒక నిర్మాతగా ఆ విషయంలో నేను ఎంతో ఆనందిస్తున్నా. టీమ్‌ ఎంతో కష్టపడి వర్క్ చేశాం. కాబట్టి, డిసెంబర్‌ 1న ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వచ్చి మా సినిమా చూసి మెచ్చుకుంటారని అనుకుంటున్నా.

‘యానిమల్‌ 2’ తెరకెక్కించే ప్లాన్ ఏమైనా ఉందా?

భూషణ్‌ కుమార్‌: అది సర్‌ప్రైజ్‌. డిసెంబర్‌ 1న మీరే తెలుసుకుంటారు.

‘యానిమల్‌’లో మీరు  ఎలా భాగమయ్యారు?

అనిల్‌ కపూర్‌: ఓసారి సందీప్‌ - భూషణ్‌ నన్ను కలిసి ఈ కథ చెప్పారు. ఇదొక తండ్రీ తనయుల కథ అని.. రణ్‌బీర్‌ హీరోగా చేస్తున్నాడని అన్నారు. సినిమాకు సంబంధించిన ఒక లైన్‌ చెప్పారు. ఆ వెంటనే ఓకే చెప్పా. బాబీ దేవోల్‌ ఇందులో యాక్ట్‌ చేస్తున్నాడని తెలిసి ఆనందించా. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడి వర్క్‌ చేశాడు.

రణ్‌బీర్‌ నటించిన ఏ చిత్రాన్ని మీరు రీక్రియేట్‌ చేయాలనుకుంటున్నారు?

అనిల్‌ కపూర్‌: యానిమల్‌. ఇందులో రణ్‌బీర్‌ను నా ఫాదర్‌లా యాక్ట్‌ చేయమని చెబుతా. హీరో రోల్‌ నేను చేస్తా. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది నా రెండో తెలుగు చిత్రం. మొదటిసారి నేను బాపుగారి దర్శకత్వంలో నటించా. ఆయనతో వర్క్‌ చేసిన ప్రతిక్షణం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన వల్లే. సినిమాపై నాకున్న క్రమశిక్షణ. కష్టపడే గుణం.. అన్నీ దక్షిణాది పరిశ్రమ నుంచే నేర్చుకున్నా.

తెలుగు ఆడియన్స్‌ గురించి..?

రణ్‌బీర్‌: తెలుగు ఆడియన్స్‌ అంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరోస్థాయిలో ఉంటాయి. తెలుగు రాష్ట్రాలవారు నన్ను కూడా తమ ఇంటి బిడ్డగా భావించాలని ఆశిస్తున్నా.

ప్రచార చిత్రాల్లో మీ లుక్‌ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం?  

బాబీ: సందీప్‌ నాకు అలాంటి పాత్ర ఇచ్చాడు. ఆయన వల్లే ఇదంతా సాధ్యమైంది. జీవితంలో ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తుంది. ట్రైలర్‌ చివర్లో చూపించిన.. (రణ్‌బీర్‌ని కొట్టి ఆయనపై పడుకుని సిగరెట్‌ కాల్చే) సీన్‌ సందీప్‌ ఐడియానే. తెలుగులో మరెన్నో సినిమాల్లో నటించాలని ఉంది.

రణ్‌బీర్‌ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?

రష్మిక: కుటుంబం, వృత్తి, అభిమానులు, తోటి నటీనటులపై ఆయన అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. అది నన్నెంతో ఆకట్టుకుంది.

మీ చిన్నతనంలో నాన్నతో గడిపిన అపురూప క్షణాలు ఏమైనా గుర్తున్నాయా?

రణ్‌బీర్‌: కొన్నేళ్ల క్రితం నేను మా నాన్నను కోల్పోయా. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత వాళ్లతో సరైన సమయాన్ని గడపలేకపోయామనే బాధలో ఉంటారు. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్‌తో బిజీగా ఉండేవారు. ఆయనపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ మా మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి.. మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది.

మీ కుమార్తె రాహ ఏం చేస్తోంది!

రణ్‌బీర్‌: సినిమాలు మానేసి పూర్తిగా నా కుమార్తెకే సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే అలా చేయలేను. ఎందుకంటే, నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కదా. తండ్రిగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా. రాహ మా జీవితంలోకి వచ్చినందుకు ఆనందిస్తున్నా.

అర్జున్‌ రెడ్డి, ఇప్పుడు యానిమల్‌.. ఇలాంటి పాత్రలను క్రియేట్‌ చేయడం ఎలా సాధ్యమవుతోంది?

సందీప్: ఏమో చెప్పలేను. తండ్రీ తనయుల కథలతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. నేను చేసే సినిమాలో ఏదైనా కొత్తగా చూపించాలనుకున్నా.

యానిమల్‌ కథను తెలుగు హీరోతో చేయాలనుకుంటే ఎవరితో తెరకెక్కిస్తారు?

సందీప్‌: మహేశ్‌బాబు

రణ్‌బీర్‌ కపూర్‌తో మీ వర్కింగ్‌ అనుభవం చెప్పగలరు?

సందీప్‌: రణ్‌బీర్‌తో వర్క్‌ చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వయసులో నాకంటే ఏడాది చిన్నవాడు. ఆయన చేసిన వర్క్‌కు నిజంగా కాళ్లు మొక్కాలి. ఈయనకు ఉన్న ఓర్పు వేరే ఎవరిలో చూడలేదు.

డీప్‌ ఫేక్‌ వీడియో గురించి ఏమైనా మాట్లాడగలరు?

రష్మిక: ఇలాంటి ఘటనలు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరికీ ఎదురవుతున్నాయి. డీప్‌ ఫేక్‌ వీడియో చూసినప్పుడు ఇలాంటి వాటిపై స్పందిస్తే ఏమనుకుంటారో అనిపించింది. కానీ, సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్‌గా నిలిచినప్పుడు.. ఇది నార్మల్‌ కాదు. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నా. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు