అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్‌ లీలా బన్సాలీ

Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ..

Updated : 20 May 2024 14:17 IST

హైదరాబాద్‌: రేషన్‌ కోసం క్యూలో నిలబడే సగటు మహిళలతో పోలిస్తే, వేశ్యలు, సెక్స్‌ వర్కర్ల పాత్రలను వెండితెరపై ఆవిష్కరించడం తనకు ఎంతో ఆసక్తిగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ అన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi). నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ విజువల్‌ వండర్‌గా నిలిచింది. తాజాగా సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘ఆ వృత్తుల్లో ఉన్న మహిళలు అంతులేని రహస్యాలకు చిరునామా. వారంతా ఒక మిస్టరీగా ఉంటారు. వేశ్య, తవాయిఫ్‌ (వేశ్య వృత్తిలో ఉన్నతస్థానంలో ఉన్న మహిళ), వ్యభిచారిణి ఎవరికి వారే విభిన్నం. కానీ, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నిగూఢ శక్తి దాగి ఉంటుంది. వారంతా చాలా గమ్మత్తుగా ఉంటారు. పాడగలరు.. డ్యాన్స్‌ చేయగలరు.. తమ భావాలను నిరభ్యంతరంగా వ్యక్తపరచగలరు. సంగీతం, నృత్యాన్ని ఆస్వాదించడంలోనే వారికి అమితమైన ఆనందం లభిస్తుంది. కళాత్మకంగా జీవించడం ఎలాగో వాళ్లకు తెలుసు. వాళ్లు జీవించే ప్రదేశం, వాడే దుస్తులు, ధరించే ఆభరణాలకు ప్రాముఖ్యం ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు రసహృదయత కలిగిన వాళ్లు.’’

‘‘మీరు వాళ్లను ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. కానీ, నాకు మాత్రం అలాంటి పాత్రలే కావాలి. నేను స్కూల్‌కు వెళ్తున్నప్పుడు రేషన్‌ కోసం వరుసలో నిలబడిన మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళల కంటే కూడా వాళ్ల (వేశ్యలు, సెక్స్‌వర్కర్లు) పట్ల నాకెంతో ఆకర్షణ ఉండేది. నా జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాను. సినిమా నుంచి టెలివిజన్‌కు రావడం కూడా అందులో ఒక భాగమే. అందరూ నన్ను పర్‌ఫెక్షనిస్ట్‌ అంటారు. కానీ, అలా ఉండటం సాధ్యం కాదు. ఒకవేళ అందరూ తాము పర్‌ఫెక్ట్‌గా ఉన్నామని అనుకుంటున్నారంటే అది వాళ్ల భ్రమ. నాకు విలాసవంతమైన జీవితం అవసరం లేదు. షారుక్‌తో దేవదాస్‌ (2002) చేస్తున్న సమయంలో నేను ఒక చిన్న గదిలో చాప మీద నిద్రపోయేవాడిని. ‘దేవదాస్‌’ చూసి రేఖాజీ నన్ను కలవడానికి వస్తానని చెప్పారు. మీరు నా దగ్గరకు వస్తే, కాస్త ఇబ్బంది పడతారని చెప్పా. ఆమె నా దగ్గరకు వచ్చారు. నేనుండే చిన్న గది, నిరాడంబర జీవితం చూశారు. ‘నేను ఇక్కడే నిద్రపోతా. నా సినిమాలను ఇక్కడే సృష్టిస్తా’ అని ఆమెతో అన్నాను. విలాసవంతమైన గదులు, బెడ్‌రూమ్‌లు నాకు అవసరం లేదు’’ అని భన్సాలీ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు