Scam 2003: ‘స్కామ్‌ 2003’-పార్ట్‌2 స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Scam 2003: స్టాంపు పేపర్ల కుంభకోణానికి సంబంధించిన అసలు వాస్తవాలతో రూపొందిన వెబ్‌సిరీస్ ‘స్కామ్‌ 2003’ పార్ట్‌-1 స్ట్రీమింగ్‌ తేదీని సోనీలివ్‌ ప్రకటించింది.

Published : 18 Oct 2023 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2003లో సంచలనం సృష్టించిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా దర్శకుడు తుషార్‌ హీరానందని తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ’ (Scam 2003). రెండు భాగాలు రూపొందిన ఈ సిరీస్‌ పార్ట్‌-1 సెప్టెంబరులో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌ వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. తొలి భాగం చూసిన వారందరూ తెల్గీ పార్ట్‌-2 ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ శుభవార్త చెబుతూ సోనీలివ్‌ ట్వీట్‌ చేసింది. ‘స్కామ్‌ 2003’ పార్ట్‌-2ను నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ (Abdul Karim Telgi) జీవితం ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్‌ తొలి భాగాన్ని ఐదు ఎపిసోడ్స్‌లో చూపించారు. రెండో భాగాన్ని కూడా దాదాపు అంతే నిడివి ఉన్నట్లు తెలుస్తోంది.

కథేంటంటే: కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్‌ కరీం తెల్గీ (గగన్‌ దేవ్‌ రియార్‌) డిగ్రీ పట్టాదారుడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగం దొరకదు. ఏ దారీ లేక చివరకు రైళ్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వ్యాపారం చేసే ఇతడి తీరు ట్రైన్‌లో ప్రయాణించే షౌకత్‌ ఖాన్‌కు బాగా నచ్చుతుంది. దాంతో, ముంబయి వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని తెల్గీకి మాటిస్తాడు. తన మధ్య తరగతి కుటుంబ సమస్యలు తొలగాలంటే ముంబయి వెళ్లాల్సిందేనని తెల్గీ ఫిక్స్‌ అవుతాడు. అలా ఖానాపూర్‌ నుంచి చిరిగిన బట్టలు, మాసిన సంచి పట్టుకుని ముంబయి బయలుదేరిన అతడు వేల కోట్ల కుంభకోణాన్ని ఎలా చేశాడు? ఆ క్రమంలో ఆయనకు సహకరించింది ఎవరు? అసలు తెల్గీ స్టాంప్‌ పేపర్లపైనే మొగ్గు చూపడానికి కారణమేంటి? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

 వేల కోట్ల కుంభకోణంపై వెబ్‌సిరీస్‌.. ‘స్కామ్‌ 2003’ ఎలా ఉందంటే?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు