Salaar: ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌.. కామన్‌ పాయింట్‌ అదే: శ్రుతి హాసన్‌

ప్రభాస్‌, శ్రుతి హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా డిసెంబరు 22న విడుదలకానున్న సందర్భంగా శ్రుతి హాసన్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 18 Dec 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో ప్రభాస్‌ (Prabhas), డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel)తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ (Shruti Haasan) అన్నారు. సెట్స్‌లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారని, అదే ఆ ఇద్దరిలో కామన్ పాయింట్‌ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సలార్ పార్ట్‌ 1: సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1– Ceasefire). డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

ఆ అంశాలపై ప్రభాస్‌తో ఎక్కువగా మాట్లాడేదాన్ని..

‘‘ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకం. నేను నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి విడుదలై హిట్‌గా నిలిచాయి. ఆ తర్వాత.. మళ్లీ నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేశా. ఇయర్‌ ఎండింగ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. ‘సలార్‌’లో నేను ఆద్యగా కనిపిస్తా. ప్రశాంతంగా, ఓపికతో ఉండే అమ్మాయి ఆద్య. కథలో కీలకపాత్ర. ప్రశాంత్‌ నీల్‌ అద్భుతమైన దర్శకుడు. ఆయన డైరెక్షన్‌లో నటించడం గొప్ప అనుభూతి. సెట్స్‌లో ఉండే ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారాయన. దర్శకుడిగా తనకేం కావాలో వారి నుంచి రాబట్టుకుంటారు. ప్రభాస్‌ దయగలవాడు. మంచి మనసున్న వ్యక్తి. అంకిత భావంతో పని చేస్తాడు. అతడు నా స్నేహితుడు అని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ప్రభాస్‌ సెట్స్‌లో అడుగుపెడుతూ ఎనర్జీ తీసుకొస్తాడు. అందరూ ఆనందంగా ఉండేలా చేస్తాడు. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌.. ఇద్దరిలో కామన్‌ పాయింట్‌ ఇదే. ప్రభాస్‌తో నేను ఎక్కువగా జనరల్‌ నాలెడ్జ్‌, మ్యూజిక్‌ గురించి మాట్లాడేదాన్ని. ఓపిగ్గా వింటూ నవ్వేవాడు’’ అని శ్రుతిహాసన్‌ షూటింగ్‌ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

సలార్‌.. కథ విన్న వెంటనే ప్రభాస్‌కు ఫోన్‌ చేశా: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

అదొక విభిన్న ప్రేమకథ..

‘‘అడివి శేష్‌తో కలిసి నేను నటిస్తున్న సినిమా విభిన్న ప్రేమ కథతో రూపొందుతోంది. స్క్రిప్టు చదవగానే నాకు బాగా నచ్చింది. ఆ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది. నేను నటించిన హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే థియేటర్లలో విడుదలవుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శాంతాను (స్నేహితుడు)తో సమయం గడపడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని తెలిపారు. మరోవైపు, నెగెటివిటీని వ్యాప్తి చేయొద్దంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా శ్రుతి హాసన్‌ పోస్ట్‌ పెట్టారు. ఇటీవల ఓ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేయగా పలువురు నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని