Shruti Haasan: ఎలాంటి సినిమా చూడాలనేది ప్రేక్షకుల ఎంపికే: శ్రుతి హాసన్‌

‘సలార్’లో ఆద్యగా పలకరించారు నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎలాంటి సినిమా చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపికేనని అన్నారు.

Published : 23 Dec 2023 13:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరుస విజయాలు అందుకుంటూ జోష్‌ మీద ఉన్నారు నటి శ్రుతి హాసన్. ఆమె నటించిన ‘సలార్‌’ కూడా హిట్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి (Shruti Haasan).. ఇటీవల వయలెన్స్‌ ఎక్కువగా ఉన్న చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడంపై స్పందించారు. ఈ సందర్భంగా ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’ గురించి ప్రస్తావించారు. ఎలాంటి సినిమా చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుల ఎంపికేనని అన్నారు.

‘‘సినిమా ఎలా ఉంటుందో టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. కేవలం సినిమాలే హింసను ప్రేరేపిస్తున్నాయనడం సరికాదు. సినిమాలు, పాటలు, కొన్ని టీవీ షోలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. వాటిలో అన్నీ హింసాత్మకంగా ఉండవు. కొన్ని ఈ జోనర్‌తో సంబంధం లేకుండా కూడా ఆకట్టుకుంటాయి. కాబట్టి ఏది చూడాలో.. ఏది వినాలో ప్రేక్షకులు ఎంపిక చేసుకోవచ్చు. అందరూ ఒకేరకమైన సినిమాలను ఇష్టపడరు. కొందరు యాక్షన్‌ సినిమాలను ఇష్టపడితే.. మరికొందరికి డ్రామాలు నచ్చుతాయి’’ అని శ్రుతి హాసన్‌ పేర్కొన్నారు.

అదరగొట్టిన ‘సలార్‌’.. మొదటి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే!

ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’లో నటించి రెండు విజయాలను సొంతం చేసుకున్నారు శ్రుతి హాసన్‌. అలాగే ఇటీవల నాని ‘హాయ్‌ నాన్న’లో కనిపించి అలరించారు. తాజాగా ‘సలార్‌’లో ఆద్యగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అడివి శేష్‌ సరసన ‘డకాయిట్‌’ (Dacoit)లో నటించనున్నారు. షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. యాక్షన్ డ్రామాగా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. త్వరలోనే దీని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇటీవల విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని