Rajamouli: అతి వేషాలు వద్దు..నోరు మూసుకో అని శాస్త్రి గారు కోప్పడ్డారు: రాజమౌళి

‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. ఎన్నో సందర్భాల్లో ఆయన పాట తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు.

Published : 27 May 2024 11:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. వారికి సంబంధించిన వృత్తిగత విషయాలను ఇటీవల పంచుకున్న ఆయన తాజాగా వ్యక్తిగత అనుబంధాన్ని తెలిపారు. ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) కార్యక్రమంలో దర్శకధీరుడు తెలిపిన విశేషాలు మీకోసం.

‘మా అందరికీ మా పెదనాన్నే పేర్లు పెట్టారు. మరకతమణి కీరవాణి, శ్రీశైల శ్రీ రాజమౌళి.. ఇలా అరుదైన పేర్లు పెట్టారు. అందుకే మా అందరికీ మా పేర్లు వింటే చాలా గర్వంగా ఉంటుంది. నా కూతురికి కూడా ఇలాంటి పేరే పెట్టాలనుకున్నా. కానీ, దొరకలేదు. అప్పుడు శాస్త్రి గారు రాసిన పాట (విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం..) చరణంలోని లైన్‌ నుంచి ‘మయూఖ’ అని పెట్టా. అందరి దర్శకుల్లానే నా పనిని ప్రశంసిస్తే చాలా సంతోషమేస్తుంది. నన్ను పొగిడితే వచ్చే సంతోషం కన్నా.. నా పనిని మెచ్చుకుంటేనే ఎక్కువ ఆనందిస్తా. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం కోసం వెళ్లకూడదనుకున్నా. ఆ విషయాన్ని ఎవరూ నొచ్చుకోకుండా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో శాస్త్రి గారు ఫోన్‌చేస్తే వెళ్లట్లేదని చెప్పా. ఆరోజు మొదటిసారి ఆయన నన్ను కోపంగా తిట్టారు’.

ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి

‘‘భారత ప్రభుత్వం నువ్వు పద్మశ్రీకి అర్హుడివి అని భావించి.. పురస్కారం అందిస్తుంటే ఎందుకు తీసుకోవు. అతి వేషాలు వేయొద్దు.. నోరు మూసుకొని వెళ్లి తీసుకో’ అని కోపంగా అన్నారు. అందుకే ఆ వేడుకకు వెళ్లి పురస్కారం తీసుకున్నా. శాస్త్రిగారి దగ్గరికెళ్లి రొమాంటిక్‌ పాటలు రాయమని చెప్పడానికి నాకు భయం. ఆయన పాట రాసే సమయంలో నేను నిద్రపోయేవాడిని పెద్దగా అరిచి లేపేవారు.  మర్యాద రామన్నలో ‘పరుగులు తీయ్‌..’ పాట రాయమని అడిగినప్పుడు ఆయన సవాలుగా తీసుకొని రాశారు. అందులో అద్భుతమైన పదాలను వాడారు. నాకెంతో ఇష్టమైన పాట అది. ఇప్పటికీ యూట్యూబ్‌లో వింటుంటా. నేను తెరకెక్కించిన ప్రతి సినిమాను చూసి ఫోన్‌ చేసేవారు. అందులో బాగున్నవి, బాగాలేని సన్నివేశాలను వివరించి సలహాలు ఇచ్చేవారు. ఆయన ఒక్క సలహా ఇచ్చినా నేను దాని గురించి చాలా రోజులు ఆలోచించే వాడిని. ఎన్నో విషయాల్లో ఆయన నాకు గురువు’.

‘శాస్త్రి గారు సినిమా పరిశ్రమ కోసం చేసిన సేవ అనిర్వచనీయం. ఆయన పాటను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది జీవితంలో ముందుకు సాగారు. అలాంటి వాళ్లలో నేనూ ఒకడిని. కష్టసమయాల్లో ఆయన పాట విని ఆ బాధ నుంచి బయటకు వచ్చిన మనుషులు లక్షల్లో ఉంటారు.  పాటను కేవలం పాటలానే కాకుండా జీవిత సత్యంగా చెప్పేవారు’ అని రాజమౌళి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు