Rachna Banerjee: ఒకప్పుడు తెలుగు సినిమాలతో అలరించి.. ఇప్పుడు ఎంపీగా గెలిచి

సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఒకప్పటి హీరోయిన్‌ రచనా బెనర్జీ గురించి పలు ఆసక్తికర విశేషాలు..

Published : 07 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించిన సినీతారల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూస్తున్నారు. ఆయా నటుల అభిమానులు కొంత సమాచారం షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో, సోషల్‌ మీడియాలో పలువురు యాక్టర్ల పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. వారిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రచనా బెనర్జీ (Rachna Banerjee) ఒకరు. ఎవరీమె? టాలీవుడ్‌లో ఏయే సినిమాలు చేశారు? రాజకీయ ప్రస్థానమేంటి? చూద్దాం..

మిస్‌ కోల్‌కతా..

కోల్‌కతాకు చెందిన రచన 1991లో మిస్‌ కోల్‌కతా కిరీటాన్ని ధరించారు. 1992 మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. అప్పట్లో ఆమెను ‘మిస్‌ బ్యూటిఫుల్‌ స్మైల్‌’ అని పిలిచేవారు. అందాల కిరీటం అందుకున్న ఆమె చిత్ర పరిశ్రమనూ ఆకర్షించింది. అలా 1993లో ‘దాన్‌ ప్రతిదాన్‌’ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేశారు. తమిళ్‌, కన్నడ, హిందీ, ఒడియా సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషించారు. 1997లో ‘నేను ప్రేమిస్తున్నాను’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా ‘కన్యాదానం’తో మంచి గుర్తింపు పొందారు. 1998లో ఆ మూవీతో పాటు మరో నాలుగు విడుదలయ్యాయంటేనే ఆమె ఎలాంటి ప్రతిభ చూపిందో అర్థం చేసుకోవచ్చు. అవే ‘మావిడాకులు’, ‘అభిషేకం’, ‘బావగారూ.. బాగున్నారా?’, ‘రాయుడు’, ‘సుల్తాన్‌’, ‘పిల్ల నచ్చింది’.. ఇలా వరుస సినిమాలతో ఆడియన్స్‌కు మంచి వినోదం పంచారు. తెలుగులో చివరిగా నటించిన చిత్రం ‘లాహిరి లాహిరి లాహిరిలో’ (2002).

76 వేలకుపైగా ఓట్లతో మెజారిటీ..

టాలీవుడ్‌కు దూరమైనప్పటికీ ఇతర భాషల్లో కొన్ని సినిమాలలో నటించి మెప్పించారు. బెంగాలీ టీవీ రియాల్టీ షో ‘దీదీ నం.1’ వ్యాఖ్యాతగా సత్తా చాటారు. అటు నటిగా, ఇటు యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రచన ఈ ఏడాదే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్నారు. ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన ఆమె..  సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీపై 76,853 ఓట్ల మెజార్టీ సాధించారు. తొలిసారిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని