Tollywood: భవదీయుడు భగత్‌ సింగ్‌.. కుశల పదాలే టైటిళ్లు

ఉత్తరాల్లో వాడే పదాలు, తెలుగు తెరపై సినిమా టైటిళ్లుగా మారాయి

Published : 11 Sep 2021 11:42 IST

మన సన్నిహితుల్ని పలకరించడానికి ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లున్నాయి. ఒక టచ్‌తో ఒకరినొకరు నేరుగా చూసుకొనే సాంకేతికత చేతుల్లోకి వచ్చి చేరింది. పూర్వం కుటుంబ సభ్యులైనా, స్నేహితులనైనా పలకరించాలంటే ఉత్తరాలే దిక్కు. పోస్ట్‌ బాక్స్‌లో వేస్తే వారానికో, పదిరోజులకో వారి చేతుల్లో పడేది.  ఆ పోస్ట్‌ బాక్స్‌లో ఉత్తరాన్ని వేసే ముందు మనసులోని భావాల్ని అక్షరాల మాలగా వాటిపై పరిచేవాళ్లు.  ఉత్తరానికో ప్రత్యేక భాష ఉండేది. సొగసైన పదాలుండేవి. ప్రియమైన వారికి, పెద్దవాళ్లను పలకరించేందుకు సుందరమైన పదాలు ఆకట్టుకునేలా ఉండేవి. ఉత్తరాల్లో వాడే పదాలు, తెలుగు తెరపై సినిమా టైటిళ్లుగా మారిన సందర్భాలున్నాయి. టాలీవుడ్‌లో అలాంటి సినిమా పేర్లు ఏమున్నాయో  ఓ సారి చూద్దాం..

భవదీయుడు పవన్‌ కల్యాణ్‌

‘గబ్బర్‌సింగ్‌’ కాంబోలో మరో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. హరీశ్‌ శంకర్‌ డైరెక్టర్‌గా పవన్‌ కల్యాణ్‌తో చేస్తున్న కొత్త చిత్రానికి తాజాగా టైటిల్‌ ప్రకటించారు. దానికి ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అని పెట్టడం ఆకట్టుకుంటోంది.  పెద్దలు లేదా అధికారులకు ఉత్తరాలు రాసేటప్పుడు చివర్లో భవదీయుడు అని కింద పేరు రాసి ముగిస్తారు. ప్రజలు దాదాపు మరిచిపోయిన ఈ పదాన్ని హరీశ్‌ శంకర్‌ తన కొత్త సినిమాకు టైటిల్‌గా పెట్టి మరోసారి భాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. 

డియర్‌ కామ్రేడ్‌

ప్రియమైన వారికి రాసే లేఖలు మొదట డియర్‌ అనే పదంతోనే మొదలవుతాయి. ప్రేయసికో, ప్రియుడికో ఉత్తరం రాయాలంటే మొదట ఈ పదాన్ని వాడాల్సిందే.  ఇలా డియర్‌ పేరుతో సినిమాలొచ్చాయి. ‘డియర్‌ కామ్రేడ్‌’ పేరుతో తెలుగులో విజయ్‌దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 

నాన్నకు ప్రేమతో

కన్నతండ్రికి రాసే ఉత్తరాల చివర నాన్నకు ప్రేమతో అని రాసి కింద తమ పేర్లు రాసుకునేవారు. ఈ వాక్యాన్నే టైటిల్‌గా పెట్టి సుకుమార్‌, ఎన్టీఆర్‌తో బ్లాక్‌ బస్టర్ సినిమా నాన్నకు ప్రేమతో చిత్రాన్ని అందించాడు. 

C/O కంచెరపాలెం

లేఖ చివర చిరునామా రాసేటప్పుడు కేరాఫ్‌ అని రాసి మనం ఏం ప్రాంతానికి చెందిన వాళ్లమో తెలియజేస్తాం. దీన్ని కూడా టైటిల్‌గా వాడి సినిమా తీస్తే టాలీవుడ్‌ గర్వించే సినిమా అయింది. అదే ‘కేరాఫ్‌ కంచెరపాలెం’. వెంకటేశ్‌ మహా దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. 

S/O సత్యమూర్తి

లేఖల్లో పేరు రాసిన తర్వాత మనమెవరమో తెలిసేందుకు దాని పక్కనే తండ్రి పేరు కూడా రాయాల్సిందే. ఫలానా వాళ్ల అబ్బాయి తెలియడానికి, ఊళ్లో మన అడ్రస్‌ సులభంగా తెలుసుకోడానికి దీన్ని వాడతారు. ఈ పదం మీదే ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అని త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేశాడు. 

ఓ మై ఫ్రెండ్‌    

 స్నేహితులకు ఉత్తరాలు రాసే క్రమంలో విరివిగా వాడే పదం ఓ మై ఫ్రెండ్‌.  ఓ మై డియర్‌ ఫ్రెండ్‌, ఓ మై ఫ్రెండ్‌ ఇలా మొదలెట్టి విషయంలోకి వెళ్తారు. ఇది కూడా సినిమా టైటిల్‌గా మారింది. సిద్దార్థ్, హన్సిక,శ్రుతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. 

ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం

విషయమంతా రాసేశాక ఉత్తరం చివర ఇట్లు అని పేరు రాసి ముగింపు పలుకుతారు.  దీని మీద కూడా పూరిజగన్నాథ్‌ టైటిల్‌ పెట్టి హిట్టు కొట్టాడు. అదే రవితేజ నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’.

ప్రియమైన నీకు

ఇక ఉత్తరముంటే ముందుగా రాసే పదమే ఇది. ప్రియమైన అని మొదలుపెట్టని లేఖలుండేవి కాదంటే అతిశయోక్తి కాదు. అలా ఉత్తరాలకు ఈ పదానికి విడదీయలేని బంధముంది. దీనిపై స్నేహ, తరుణ్‌లు హీరోహీరోయిన్లుగా ‘ప్రియమైన నీకు’ అనే సినిమా వచ్చింది.

శ్రీవారికి ప్రేమలేఖ

భార్యభర్తలు ఒకరికొకరు లేఖలు రాసుకునే సందర్భంలో శ్రీమతికి ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ అని రాసుకునే అలవాటుండేది.  శ్రీవారికి ప్రేమలేఖ వాక్యాన్ని సినిమా టైటిల్‌గా మార్చి జంధ్యాల ఒక సూపర్‌హిట్‌ సినిమాను అందించారు. అందులో నరేశ్‌‌, పూర్ణిమలు హీరోహీరోయిన్లుగా నటించారు.  ఇలా ఉత్తరాల్లోని ఈ సొగసైన పదాలు సినిమా పేర్లుగా మారి తెలుగు తెరకు మరింత అందాన్ని మరింత అందాన్ని తీసుకొచ్చాయి.                                                             

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని