Sudheer Babu: భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దు: సుధీర్‌ బాబు విజ్ఞప్తి

తాను నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమాని భూతద్దంతో చూడొద్దని హీరో సుధీర్‌ బాబు విజ్ఞప్తి చేశారు. ఆయన ఆ మాట ఎవరినుద్దేశించి అన్నారంటే?

Published : 02 Oct 2023 22:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా హర్ష వర్దన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). ఈషా రెబ్బా (Eesha Rebba), మృణాళిని రవి (Mirnalini Ravi) కథానాయికలు. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, హీరోలు శర్వానంద్‌, విశ్వక్‌సేన్‌, శ్రీవిష్ణు, అశోక్‌ గల్లా ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

అందుకే పూజా హెగ్డేను రీప్లేస్‌ చేశాం: నిర్మాత నాగవంశీ

వేడుకనుద్దేశించి సుధీర్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లోకి రాకముందే నేను, శర్వానంద్‌ కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయమయ్యాం. ‘నాకు నటుడవ్వాలని ఉంది. ఏమైనా సలహాలిస్తావా’ అని ఓ రోజు అడిగాడు. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పా. కష్టపడి తన కలను నెరవేర్చుకున్నాడు. శ్రీవిష్ణు తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ క్రియేట్‌ చేసుకుంటున్నాడు. విశ్వక్‌ సేన్‌ వ్యక్తిత్వం నాకు ఇష్టం. బిందాస్‌గా బతుకుతాడు. నటుడిగా నాకు జీవితాన్ని ఇచ్చిన కృష్ణగారి ఆశీస్సులు నాకెప్పుడూ ఉంటాయని భావిస్తున్నా. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి. లాంటి నిర్మాణ సంస్థలు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరం. భవిష్యత్తులోనూ ఈ సంస్థ మంచి సినిమాలు నిర్మిస్తుందని నమ్ముతున్నా. ఈషా రెబ్బా, మృణాళిని రవి అద్భుతంగా నటించారు. మృణాళినితో కలిసి నేను నటించిన కొన్ని సీన్స్‌ ‘ఖుషి’ సినిమాని గుర్తుచేస్తాయి. హర్ష వర్దన్‌ ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆలోచిస్తాడు. నటనపై నాకు ఉన్న ఇష్టమో, పైత్యమో మీపై (ఆడియన్స్‌) రుద్దాలనుకోవడంలేదు. కథ బాగా నచ్చడంతో నటించా. ఒకవేళ నేను నటించకపోయినా ఈ సినిమాని చూసేందుకు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు వెళ్తా. ఈ సినిమాలోని దుర్గ పాత్రకు సంబంధించిన ప్రాస్తెటిక్‌ మేకప్‌ సరిగా లేదనే ఓ నెగెటివ్‌ మీమ్‌ని చూశా. భూతద్దంతో సినిమా చూడొద్దని ఈ సందర్భంగా దాన్ని క్రియేట్‌ చేసిన మీమర్‌, క్రిటిక్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రేక్షకులెప్పుడూ భూతద్దంతో సినిమాలు చూడరు. ఈ సినిమా మంచి వినోదం పంచుతుంది’’ అని అన్నారు. 

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: శేఖర్‌ కమ్ముల

‘‘రానా హీరోగా నేను తెరకెక్కించిన ‘లీడర్‌’లో హర్ష వర్దన్‌ నటించారు. ఆయనలో కామెడీ టైమింగ్‌ ఉందని అప్పుడే అర్థమైంది. ఆయన దర్శకత్వం వహించిన ‘మామా మశ్చీంద్ర’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సుధీర్‌ బాబు అనగానే చాలామంది హార్డ్‌ వర్క్‌ అని అంటుంటారు. ఈషా రెబ్బా, శ్రీ విష్ణుతో నాకు ఎప్పటి నుంచో (లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమా నుంచి) పరిచయం ఉంది. ఇదంతా మా గ్యాంగే’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అనంతరం శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్న పాత్ర పోషించేందుకే మేం ఎంతో కష్టపడుతున్నాం. సుధీర్‌ ఇందులో మూడు పాత్రలు పోషించాడు. అలా చేయాలంటే చాలా ధైర్యంకావాలి. సుధీర్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. కష్టపడి పనిచేస్తాడు. బాలీవుడ్‌ వరకూ వెళ్లాడు. ‘అమ్మ చెప్పింది’ సినిమా నుంచి హర్ష వర్దన్‌ నాకు తెలుసు’’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని