Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్‌ చేశాం: నిర్మాత నాగవంశీ

‘గుంటూరు కారం’ సినిమా విషయంలో హీరోయిన్‌ పూజా హెగ్డేను ఎందుకు రీప్లేస్‌ చేయాల్సి వచ్చిందో నిర్మాత నాగవంశీ తెలిపారు. ఆయన ఏమన్నారంటే?

Published : 03 Oct 2023 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఇటీవల.. ఏ సినిమా విషయంలో రానన్ని రూమర్స్‌ ఈ చిత్రం గురించి వచ్చాయి. ముందుగా అనుకున్న కథ మారిందని, సంగీత దర్శకుడిని మార్చారని, రీ షూట్‌ చేశారని, సినిమా వాయిదా పడుతుందంటూ పలు వార్తలు వెబ్‌సైట్లలో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిపై నిర్మాత నాగవంశీ ఇప్పటికే స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లోనూ వాటిని ఖండిస్తూ ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) ఎందుకు నటించడంలేదో తెలిపారు.

రజనీకాంత్‌ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్‌.. ఎవరెవరంటే?

‘‘ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామనుకుని తర్వాత 2024 జనవరి 12కు మార్చాం. దాంతో, కంగారులేకుండా నెమ్మదిగా షూటింగ్‌ చేయాలనుకున్నాం. కానీ, అదే సమయంలో పూజా హెగ్డే మరో హిందీ చిత్రంలో నటించాల్సి వచ్చింది. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో ఆమెను రీప్లేస్‌ చేశాం. దానికే కొందరు హంగామా ఎందుకు చేశారో నాకు అర్థంకాలేదు. పండగకు రావాల్సిన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. మహేశ్‌ బాబు విభిన్నంగా కనిపిస్తారు. ప్రస్తుతానికి రెండు పాటలు సిద్ధమయ్యాయి. ఫస్ట్‌ సింగిల్‌ (మెలొడీ) త్వరలోనే విడుదల చేస్తాం. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని స్పష్టం చేశారు. ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నటించకపోవడంతో మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు.

తదుపరి చేయనున్న చిత్రాల గురించి నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమి తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో శ్రీలీలే హీరోయిన్‌. మేం ఎలాంటి మార్పులు చేయలేదు. రష్మికను ఎంపిక చేశామని ఇటీవల వార్తలొచ్చాయి. ఆమెను మేం సంప్రదించలేదు కూడా. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మిస్తున్నాం. అది ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, విశ్వక్‌సేన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్వ్కేర్‌’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. తర్వాత, అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా, ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ సినిమా చేయనున్నాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు