Yash: బాలీవుడ్‌ రామాయణం.. నిర్మాతగా యశ్‌

రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) ఓ భారీ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

Published : 12 Apr 2024 16:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) ఓ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించనున్నారని సమాచారం. ఇప్పుడీ ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ నటుడు యశ్‌ భాగమయ్యారు. భారీ బడ్జెట్‌తో సిద్ధం కానున్న ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈమేరకు ఆయన చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రా తో టీమ్‌ అప్‌ అయ్యారు.

‘‘భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లే చిత్రాలు తెరకెక్కించాలనే ఉద్దేశంతో మాన్‌స్టర్ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మొదలుపెట్టా. అలాంటి కథల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈక్రమంలోనే లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఒక అత్యుత్తమ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా. అది నమిత్‌ మల్హోత్రాదేనని తెలిసి ఆశ్చర్యపోయా. సినీ పరిశ్రమకు సంబంధించి మేమిద్దరం ఎన్నో అభిప్రాయాలు పంచుకున్నాం. కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుపుతున్న సమయంలో రామాయణం టాపిక్‌ వచ్చింది. ఈ చిత్రానికి సహ నిర్మాతగా పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా గ్రాండ్‌ స్కేల్‌లో దీనిని రూపొందించనున్నాం’’ అని యశ్‌ పేర్కొన్నారు.

దర్శకుడు నితీశ్‌ తివారీకి బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ‘చిల్లర్‌ పార్టీ’ అనే సినిమాతో 2011లో ఆయన దర్శకుడిగా తొలిఅడుగు వేశారు. అప్పట్లో ఈ సినిమా పలు విభాగాల్లో జాతీయ చలనచిత్ర అవార్డులు సొంతం చేసుకుంది. ‘దంగల్‌’, ‘చిచోరే’తో నితీశ్‌ సూపర్‌హిట్స్‌ అందుకున్నారు. ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా రామాయణం రూపొందనుంది. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌.. రావణాసురుడిగా యశ్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూట్‌ మొదలైందని.. చిత్రీకరణకు సంబంధించిన విషయాలు బయటకురాకుండా నితీశ్‌ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. ముఖ్యంగా సెట్‌లోకి సెల్‌ఫోన్లనూ నిషేధించినట్లు టాక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని