Tamannaah: ఏదో ఒకరోజు నా సినిమాను నేనే డైరెక్ట్‌ చేసుకుంటా: తమన్నా

ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తానని తమన్నా అన్నారు. తన సినిమాకు తానే దర్శకత్వం వహించుకుంటానన్నారు.

Published : 01 Apr 2024 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తున్నారు నటి తమన్నా (Tamannaah Bhatia). తన తాజా చిత్రం ‘అరణ్మనై 4’ ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో తాను పనిచేసిన దర్శకుల గురించి చెప్పారు. భవిష్యత్తులో తాను దర్శకురాలిని అవుతానంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

‘‘కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో నటించడం నేనెప్పటికీ మర్చిపోలేను. సూర్య హీరోగా తెరకెక్కిన ‘అయాన్‌’ (తెలుగులో ‘వీడొక్కడే’) కోసం ఆయనతో పని చేశాను. ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా తీస్తారు. ఆ సినిమా కోసం నేను 15 రోజులే డేట్స్‌ ఇచ్చాను. నా భాగానికి సంబంధించిన షూటింగ్‌ మొత్తం 15 రోజుల్లోనే పూర్తి చేశారు. అది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఆశ్చర్యమే. అనుకున్న సమయానికి పాటలు, సన్నివేశాలు అన్నీ పూర్తయ్యాయి. ఇదంతా పక్కనపెడితే ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం’ అని గుర్తుచేసుకున్నారు. ఇక దర్శకత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకురాలిని కావాలనే కోరిక నాలోనూ ఉంది. ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. ఏదో ఒకరోజు నా సినిమాను నేనే డైరెక్ట్‌ చేసుకుంటా’’ అని చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.

‘అరణ్మనై’ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ దాదాపు పదేళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన ‘అరణ్మనై’ సూపర్‌హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘అరణ్మనై 2’ తెరకెక్కించారు సుందర్‌. 2016లో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో ‘అరణ్మనై 3’ విడుదలైంది. రాశీఖన్నా, ఆర్య, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడు దీని నాలుగో భాగం ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఇందులో రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని