Tollywood: సమాజంలో చైతన్యం నింపిన అక్షర సేనాని రామోజీరావు

‘‘సినిమా అంటే కేవలం వినోదమే కాదు... విజ్ఞానం కూడా అని చాటిన నిర్మాత రామోజీరావు. ప్రజల్లో మార్పుని తీసుకు రావల్సింది సినిమానే అని నమ్మడంతోపాటు.. చిత్ర ప్రపంచానికీ తెలిసేలా చేశార’’న్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

Published : 10 Jun 2024 01:56 IST

‘‘సినిమా అంటే కేవలం వినోదమే కాదు... విజ్ఞానం కూడా అని చాటిన నిర్మాత రామోజీరావు. ప్రజల్లో మార్పుని తీసుకు రావల్సింది సినిమానే అని నమ్మడంతోపాటు.. చిత్ర ప్రపంచానికీ తెలిసేలా చేశార’’న్నారు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. వినోద రంగంపై చెరగని ముద్ర వేసిన దార్శనికుడు, ప్రముఖ నిర్మాత, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభని తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఆదివారం హైదరాబాద్‌లోని నిర్మాతల మండలి కార్యాలయంలో నిర్వహించారు. రామోజీరావు చిత్ర పటానికి పూల మాలలు వేసి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పలువురు దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు. 

  • ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘మనమే ఎందుకు ఉద్యోగం సృష్టించకూడదనే ఓ చిన్న ఆలోచనతో ప్రయాణం మొదలుపెట్టిన రామోజీరావు జీవితం ఎంతో ఎత్తుకు ఎదిగింది. పలు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన చంద్రబాబు నాయుడు ఓ నిర్మాత పాడెని భుజాలపై మోశారంటే... సినిమా పరిశ్రమకు అంతకంటే ఏం గౌరవం కావాలి? ఆయనతో 42 ఏళ్ల పరిచయం మాది. రామోజీ ఫిల్మ్‌సిటీలోకి అడుగుపెడితే ఓ ధైర్యం వస్తుంది. రామోజీరావు భారతరత్న పురస్కారానికి సమానమైన వ్యక్తి’’ అన్నారు. 
  • నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమతోపాటుగానే అప్పట్లో మద్రాస్‌ నుంచి వచ్చిన మేమంతా ఆశ్చర్యపోయేలా రామోజీ ఫిల్మ్‌సిటీ కట్టి మాకు చూపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్పు కోరుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు. 
  • ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు  విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాకు రామోజీరావుతో నేరుగా పరిచయం లేదు. అది తీరని లోటు. వారు భౌతికంగా మన మధ్యన లేకపోవచ్చు కానీ, ఆయన నమ్మిన విలువల్ని మనం పాటిస్తే శాశ్వతంగా ఆయన మనతో ఉన్నట్టే’’ అన్నారు. 
  • మా ఉపాధ్యక్షుడు  మాదాల రవి మాట్లాడుతూ ‘‘రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. పత్రికల్ని, సినిమాల్ని ఆయుధాలుగా ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు’’ అన్నారు.
  • దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ మాట్లాడుతూ ‘‘తాత్వికుడు, దార్శనికుడు రామోజీరావు. ‘మయూరి’, ‘మౌనపోరాటం’, ‘ప్రతిఘటన’ తదితర సినిమాలతో ఎంతోమందికి స్ఫూర్తి కలిగించారు’’అన్నారు. 
  • రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘‘ఉషాకిరణ్‌ మూవీస్‌ నుంచి వచ్చిన రెండో చిత్రం ‘సుందరి సుబ్బారావు’కి నేను దర్శకత్వం వహించా. ఆ సినిమా ప్రయాణంలోనే రామోజీరావుని దగ్గర్నుంచి చూశా. ఆయన సమయ పాలన, వ్యాపారంలో ఆయన పాటించే విలువలు స్ఫూర్తినిచ్చాయ’’న్నారు. 
  • తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘సమాజంలోని చెడుని తొలగిస్తూ, చైతన్యం నింపిన అసాధారణ వ్యక్తి రామోజీరావు’’అన్నారు. 
  • నటుడు శివారెడ్డి మాట్లాడుతూ ‘‘వేల కుటుంబాలకి మార్గదర్శిగా నిలిచిన ఒక మహావృక్షం రామోజీరావు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘ఆనందం’ సినిమాతోనే నాకు ఆ తర్వాత హీరోగా అవకాశాలు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్, శివలెంక కృష్ణప్రసాద్, దర్శకులు పి.ఎన్‌.రామచంద్రరావు, అజయ్‌కుమార్, సుబ్బారెడ్డి, తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విజేందర్‌ రెడ్డి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్, సురేశ్, శివ కంఠమనేని, అంబటి శ్రీను, శివలింగ ప్రసాద్,  రచయిత ఉమర్జీ అనురాధ, చిన్నబాబు, టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, కుమనన్‌ సేతురామన్‌ తదితరులు పాల్గొన్నారు. 

రుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘రామోజీరావుగారితో నాకు రెండు రకాల అనుబంధాలున్నాయి. మేం ఆ సంస్థలో ‘మౌనపోరాటం’ చిత్రానికి రచయితగా పనిచేయక ముందే, ఆయన ప్రియ సంస్థలో మా అమ్మనాన్నలు   పనిచేసేవారు. రచయితలుగా మా కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో రామోజీరావు నిర్మించిన ‘మౌనపోరాటం’ ఒకటి. ఆ సినిమా ఓ అద్భుతం. సమాజంలో చైతన్యాన్ని నింపిన అక్షర సేనాని రామోజీరావు. ఈనాడుతో పత్రికా    ప్రపంచంలో సంచలన మార్పు చోటు చేసుకుంది. ఈ వార్తాంశం ఈనాడులో వచ్చిందా? ఈటీవీలో ప్రసారమైందా? అని తెలుసుకున్నాకే వాటిపై ఓ నిర్ణయానికొస్తామంటే ఆ సంస్థ ఎంత విశ్వసనీయత సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.


కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేలా... 

టెలివిజన్‌తో వినోదం, సమాచారాన్ని కలగలిపి తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత రామోజీరావుకు దక్కుతుందని కొనియాడాయి తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ వర్గాలు. రామోజీరావు మృతిపట్ల ఆదివారం హైదరాబాద్‌లో సంతాప సభని నిర్వహించారు. ప్రముఖ వ్యాఖ్యాత సుమ నేతృత్వంలో జరిగిన ఈ సభలో రామోజీ రావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, ఆయనకి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సుమ మాట్లాడుతూ ‘‘కొన్ని తరాలు గుర్తు పెట్టుకునేంతగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై ప్రభావం చూపించారు రామోజీరావు. ఆయన విలువల్ని, స్ఫూర్తిని కొనసాగిస్తామ’’న్నారు. ఈ కార్యక్రమంలో టెలివిజన్‌ ఫెడరేషన్‌కి చెందిన పలువురు నాయకులు, నటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు