The Goat Life: రికార్డులు సృష్టిస్తోన్న ‘ఆడు జీవితం’.. టాప్‌ 5లో చోటు..

ఇటీవల విడుదలైన ‘ఆడు జీవితం’కు ప్రేక్షకులు భారీ విజయాన్ని అందించారు. దీంతో ఇది సంచలనాలు సృష్టిస్తోంది.

Published : 12 Apr 2024 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’ (Aadujeevitham) రికార్డులు సృష్టిస్తోంది. విడుదలకు ముందు నుంచే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం రిలీజ్‌ తర్వాత ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించి మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడీ మూవీ మలయాళం స్టార్‌ హీరో నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం వసూళ్లను దాటేసింది.

తాజా గణాంకాల ప్రకారం.. మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ ఆల్‌టైమ్‌ కలెక్షన్లను (రూ.128 కోట్లు) ‘ఆడు జీవితం’ (రూ.130* కోట్లు) బీట్‌ చేసింది. దీంతో మలయాళంలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ 5 చిత్రాల్లో చేరింది. దీనిపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఈ సర్వైవల్‌ డ్రామా ఇంకెన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో వేచి చూడాలి. మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’కు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించడం విశేషం. 

బెన్నీ డానియల్‌ (బెన్యామిన్) రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ దీనికి దర్శకత్వం వహించారు.  ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్‌ చాలా కష్టపడ్డారు. ఏకంగా 16 ఏళ్ల పాటు దీని కోసం శ్రమించారు. ఇందులో నజీబ్‌ పాత్రలో ఒదిగిపోవడం కోసం 31 కిలోల బరువు తగ్గారు. 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఆయన షూట్‌లో పాల్గొన్నారు. ఇప్పుడీ సినిమా సృష్టిస్తోన్న విజయాన్ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  పృథ్వీరాజ్‌ కష్టానికి ఫలితం దక్కిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది మలయాళంలో విడుదలైన మంజుమ్మెల్‌ బాయ్స్‌ ఈ జాబితాలో టాప్‌-1లో నిలిచింది. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇంకా పలు చోట్ల ఈ మూవీ ప్రదర్శితమవుతోంది. దీని తర్వాత ‘2018’ (రూ.176 కోట్లు), ‘పులి మురుగన్‌’ రూ.150 కోట్లు,  ప్రేమలు రూ.136 కోట్లు వసూళ్లు సాధించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు