The Kerala Story: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ఓటీటీలోకి రానున్న ‘ది కేరళ స్టోరీ’

అదా శర్మ (adah sharma) ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Published : 06 Feb 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిందీ చిత్రం. గతేడాది  మే 5న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఇది వచ్చేస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది. ఇందులో అదాశర్మ ప్రధానపాత్రలో కనిపించారు. ప్రకటించిన దగ్గరినుంచే వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రాన్ని మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులు దీనిపై పోస్ట్‌లు పెట్టడంతో గతేడాది హాట్ టాపిక్‌గా నిలిచింది.

‘ఈగల్‌’ టీమ్‌ డేరింగ్‌ స్టెప్‌.. అందుబాటు ధరలో మూవీ టికెట్స్‌.. మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

నేపథ్యమిదే..

దర్శకుడు సుదీప్తోసేన్‌ ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా ‘32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. ఓ నలుగురు యువతులు మతం మారి, అనంతరం ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో కథ నడుస్తుంది. అయితే, తప్పిపోయిన అమ్మాయిలు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది, భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచేస్తున్నారనే కోణంలో చూపించడం వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి నిర్మాతగా విపుల్‌ అమృత్‌లాల్‌ షా వ్యవహరించారు. గతంలో ‘అస్మా’, ‘లఖ్‌నవూ టైమ్స్‌’, ‘ది లాస్ట్‌ మాంక్‌’ వంటి చిత్రాలు నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని