Cinema Lovers Day: ₹99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా..! ఒక్క రోజు మాత్రమే..

సినీ ప్రేక్షకుల కోసం థియేటర్‌ యాజమాన్యం ఓ ఆఫర్‌ ప్రకటించింది. సినిమా లవర్స్‌ డే రోజు కేవలం ₹99కే సినిమా చూసే సదుపాయాన్ని అందిస్తోంది.

Published : 30 May 2024 00:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ ప్రియులకు థియేటర్ల యాజమాన్యం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సినిమా టికెట్‌ ధరల్ని తగ్గించింది. మే 31న ‘సినిమా లవర్స్‌ డే’ సందర్భంగా కేవలం ₹99కే సినిమా చూసే సదుపాయాన్ని కల్పిస్తోంది. తక్కువ ధరకు సినిమా అందించడానికి మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్‌ సినిమా హాళ్లు చేతులు కలిపాయి. ఈ ప్రత్యేక ఆఫర్ పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీపోలిస్ ఇండియా, మిరాజ్‌ సినిమాస్‌, మూవీ మ్యాక్స్‌ సహా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం దేశవ్యాప్తంగా ఉన్న 4,000 స్క్రీన్‌లలో అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) అధిపతి, PVR ఐనాక్స్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందానీ అన్నారు. ప్రీమియం సీట్లు మినహా మిగిలిన 90శాతం సీట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందన్నారు. ప్రత్యేకంగా దక్షిణాదిలోని సింగిల్‌- స్క్రీన్స్‌లో కూడా ఈ సదుపాయం ఉందన్న ఆయన కొన్ని థియేటర్లలో రూ.70 కంటే తక్కువ ధరకే టికెట్లు కొనుగోలు చేయొచ్చన్నారు. దీంతో ఎక్కువ మంది థియేటర్లకు వస్తారన్నారు. ఇదిలా ఉండగా.. 2022లో జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ ప్రకటించగా ఏకంగా 65 లక్షల మంది సినిమాలను చూశారు.

ఇప్పటికే విడుదలైన చిత్రాలతోపాటు కొత్త చిత్రాలు చూసే అవకాశం ఉంది. ‘భజే వాయు వేగం’, ‘గం. గం.. గణేశా’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ తదితర చిత్రాలు మే 31న విడుదల కానున్నాయి.

గమనిక: రెక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్లకు ఈ అవకాశం లేదు. ఎంపిక చేసిన నగరాల్లోని కొన్ని థియేటర్లకే ఈ ఆఫర్‌ వర్తించనుంది. కేవలం ఒక్కరోజే. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేస్తే అదనపు ఛార్జీలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని