Pan India Movies: అక్కడివాళ్లు ఇక్కడ ఇక్కడివాళ్లు అక్కడ

పాన్‌ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్లు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం.

Published : 24 May 2024 01:33 IST

పాన్‌ ఇండియా జమానా ఇది. భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ఇది తెలుగు సినిమా, వీళ్లు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం. అన్ని సినిమాలూ అన్ని భాషల్లోకి వెళుతున్నాయి. నటులూ అదే తరహాలో ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇదే అదనుగా దర్శకనిర్మాతలు సరికొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడుతున్నారు. అన్ని భాషల నటుల్ని కలుపుతూ... ఇదివరకు చూడని కలయికల్ని తెరపైకి తీసుకొస్తూ... ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. దాంతో తారలు తారుమారు అవుతూ ఇక్కడివాళ్లు అక్కడ... అక్కడివాళ్లు ఇక్కడ బిజీ అయిపోతున్నారు. ముఖ్యంగా కథానాయికలు!

క్షిణాది కథానాయికలు హిందీ పరిశ్రమకి వెళ్లి సత్తా చాటడం కొత్తేమీ కాదు. అదే తరహాలో హిందీ తారలూ ఇక్కడి సినిమాల్లో అవకాశాల్ని అందుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. అయితే అక్కడ అగ్ర కథానాయికలుగా చలామణీ అవుతున్న భామలు మాత్రం...  ఇదివరకు ప్రాంతీయ భాషలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు. పాన్‌ ఇండియా ట్రెండ్‌ అలాంటి సమీకరణాల్ని మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర తారలు సైతం తెలుగు, తమిళ తదితర ప్రాంతీయ పరిశ్రమలకొచ్చి నటిస్తున్నారు. అలాగే హిందీలో అగ్ర కథానాయకుల చిత్రాల్లో దక్షిణాది నాయికలకి ఇదివరకు ఎప్పుడో కానీ అవకాశాలు దక్కేవి కాదు. కానీ పాన్‌ ఇండియా ట్రెండ్‌తో మన కథానాయికల ప్రతిభ బలంగా వెలుగులోకి రావడం, వాళ్లకి అన్ని భాషల్లోనూ అభిమానులు ఏర్పడుతుండడంతో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఎప్పటికప్పుడు తెరపై సరికొత్త కలయికలు దర్శనమిస్తున్నాయి.

తెలుగుపై మనసు

దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, కియారా అడ్వాణీ, దిశా పటానీ... వీళ్లంతా తెలుగు సినిమాలతో తెరపై సందడి చేయనున్న హిందీ భామలే. తెలుగు పరిశ్రమ నుంచి రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమాల్లో అవకాశాల్ని అందుకున్నారు. అంతకుముందు అలియాభట్, అనన్యపాండే కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘లైగర్‌’ సినిమాలతో సందడి చేశారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కల్కి 2898ఎ.డి’ సినిమాలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణెతోపాటు, దిశాపటానీ నటించింది. వీళ్ల అందం ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుంది. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’లో కియారా అడ్వాణీ  నటించింది. ‘భరత్‌ అనే నేను’ నుంచీ కియారా క్రమం తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది. జాన్వీ కపూర్‌ ‘దేవర’తో తెలుగులో పరిచయం అవుతోంది. ఎన్టీఆర్‌ సరసన ఆమె నటిస్తుండడంతో అందరి దృష్టి ఈ కలయికపైనే ఉంది. రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది.

హిందీ చిత్రాలపై దృష్టి

పూజాహెగ్డే, కీర్తిసురేశ్, సాయిపల్లవి, రష్మిక... వీళ్లంతా దక్షిణాదిలో స్టార్‌ కథానాయికలుగా చలామణీ అయ్యారు. అగ్ర కథానాయకుల సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. వీళ్లంతా ఇప్పుడు హిందీ సినిమాలపై దృష్టిపెట్టారు. పూజాహెగ్డే ఎప్పట్నుంచో హిందీలో నటిస్తున్నా... దక్షిణాది కథానాయికగానే గుర్తింపు ఉంది. ఆమెకి ఎక్కువ విజయాలు ఉన్నది తెలుగులోనే. కొంతకాలంగా హిందీ సినిమాలతోనే గడుపుతోంది. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘దేవా’లో నటిస్తోంది. ‘బేబి జాన్‌’తో కీర్తి సురేశ్‌ హిందీలో పరిచయం అవుతోంది. రష్మిక.. ‘సికందర్‌’, ‘ఛావా’ చిత్రాల్లో నటిస్తుంది. సాయిపల్లవి ‘రామాయణ’లో అవకాశాన్ని అందుకుంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడు. ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. నయనతార, సమంత కూడా హిందీ సినిమాలపై ఓ కన్నేసి ఉంచారు. తమన్నా, రాశీఖన్నా తదితర భామలు తరచూ హిందీ సిరీస్‌లు, సినిమాల్లో నటిస్తూ అక్కడా ఇక్కడా రాణిస్తుంటారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కొంతకాలంగా పూర్తిగా హిందీ సినిమాలతోనే ప్రయాణం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని