RRR: జపాన్‌లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ క్రేజ్‌.. ఒక్క నిమిషంలో థియేటర్‌ హౌస్‌ఫుల్‌

జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్‌’ విడుదలై ఏడాదిన్నర అయినా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

Published : 14 Mar 2024 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ (RRR) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇది రికార్డులు సాధించింది. తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

జపాన్‌లో ఈ సినిమా రిలీజై ఏడాదిన్నర అయినా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆర్‌ఆర్ఆర్‌’ తన అధికారిక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. మార్చి 18న ఈ సినిమాను వీక్షించేందుకు రాజమౌళి జపాన్‌ వెళ్లనున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కడి ప్రేక్షకులు ఆయనతో కలిసి చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో వేలాదిమంది టికెట్స్ కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఫలితంగా బుధవారం రాత్రి టికెట్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేయగా.. ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్ఆర్‌ క్రేజ్‌ ఇది’, ‘రాజమౌళి మన తెలుగు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారు’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?

పాన్‌ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విదేశాల్లోనూ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం జపాన్‌లో గతేడాది అక్టోబరు 21న విడుదలైంది. 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్‌ తెరలపై ప్రదర్శించారు. 34 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టి 300 మిలియన్‌ జపాన్‌ యెన్‌ల క్లబ్‌లో చేరింది. మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.18 కోట్లు. ఈ క్లబ్‌లో అత్యంత వేగంగా చేరిన తొలి భారతీయ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలోని  ‘నాటు నాటు...’ (Naatu Naatu Song) బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుని ఎంతో మంది తెలుగు సినీ ప్రియుల కలను నెరవేర్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని