Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?

యంగ్‌ హీరోయిన్‌ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి?

Published : 14 Mar 2024 10:00 IST

‘‘గిరిజ (గీతాంజలి ఫేమ్‌), సాయి పల్లవి (ఫిదా ఫేమ్‌) ఎలా అయితే మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారో మమితా బైజు అలా చేసింది. ఎంతో చలాకీగా నటించింది’’.. ‘ప్రేమలు’ (Premalu) సక్సెస్‌ మీట్‌లో యంగ్‌ హీరోయిన్‌కు డైరెక్టర్‌ రాజమౌళి (Rajamouli) ఇచ్చిన ప్రశంస ఇది. అగ్ర దర్శకుడు ఇలా అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపై (Mamitha Baiju) పడింది. ఎవరీ మమితా బైజు? ఆమెకెందుకంత క్రేజ్‌?

‘ప్రేమలు’తో తెలుగు వారికి పరిచయం..

మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాని అదే పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. కంటెంట్‌ బాగుంటే ఏ భాషలో తెరకెక్కిన చిత్రాన్నైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. నటీనటులు, దర్శకుడు.. అందరూ ఇక్కడి వారికి కొత్తే. కానీ, వారి ప్రతిభ కట్టిపడేసింది. ముఖ్యంగా మమిత అందం, అభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌ రీనూ పాత్రలో ఒదిగిపోయి ఎంతోమందికి అభిమాన నటిగా మారింది. దీంతో, సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో.. ఆమె గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్‌, ‘ప్రేమలు’లోని పాటలు, ఆమె ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ‘న్యూ క్రష్‌’, ‘క్యూట్‌’ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. నేరుగా తెలుగులో నటించకపోయినా డబ్బింగ్‌ చిత్రంతో ఇంతటి క్రేజ్‌ సొంతం చేసుకోవడం విశేషం. ఈ అందాల భామకు కోలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయి.   జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సరసన ఆమె నటించిన ‘రెబల్‌’ మార్చి 22న విడుదల కానుంది. విష్ణు విశాల్‌ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో మమిత హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిందని సమాచారం.

సహాయ నటిగా..

ఈ బ్యూటీకి ‘ప్రేమలు’ 16వ సినిమా. మిగిలిన చిత్రాలన్నింటిలో సపోర్టింగ్‌ క్యారెక్టర్లు ప్లే చేసింది. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం ‘సర్వోపరి పలక్కరన్‌’ (2017). ఆమె నటించిన ‘హనీ బీ 2: సెలబ్రేషన్స్‌’ అదే ఏడాది విడుదలైంది. ‘డాకినీ’, ‘స్కూల్‌ డైరీ’, ‘వికృతి’, ‘కిలోమీటర్స్‌ అండ్‌ కిలోమీటర్స్‌’, ‘ఆపరేషన్‌ జావా’ వంటి విభిన్నతరహా కథల్లో భాగమైంది. ‘ఖోఖో’ (2021) సినిమాలో ఖోఖో గేమ్‌ టీమ్‌ కెప్టెన్‌గా వైవిధ్యం ప్రదర్శించి, ఉత్తమ సహాయ నటిగా ‘కేరళ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డు’ అందుకుంది. గతేడాది ‘ప్రణయ విలాసం’, ‘రామచంద్ర బాక్‌ అండ్‌ కో’ సినిమాలతో మలయాళ ప్రేక్షకుల్ని అలరించింది.

‘మగధీర’తో మొదలు..

తెలుగు సినిమాలంటే ఇష్టమని, తాను చూసిన తొలి తెలుగు చిత్రం ‘మగధీర’ అని మమిత ఓ సందర్భంలో తెలిపింది. ఆ చిత్రాన్ని, ‘ఈగ’ను ఎన్నోసార్లు చూశానని చెప్పింది. అల్లు అర్జున్‌ అభిమానినని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టింది.

డాక్టర్‌కు ‘నో’..

కేరళలోని కొట్టాయంలో జన్మించిన మమిత ప్రస్తుతం.. సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. పాఠశాల రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చరుగ్గా ఉండేది. కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంది. అలా ఓసారి స్కూల్‌లో ఇచ్చిన ప్రదర్శనకు సంబంధించిన ఫొటో ఆమెకు ‘సర్వోపరి..’లో అవకాశం తెచ్చిపెట్టింది. అలా నటనపై ఆసక్తి లేకుండానే తెరంగేట్రం చేసింది. అప్పుడు తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆమె తండ్రి బైజు.. వైద్యుడు. తనలాగే కుమార్తెనూ డాక్టర్‌ని చేయాలనుకున్నారాయన. కానీ, మమితకు అది ఇష్టం లేదట. సినీ రంగంలోనే రాణిస్తానంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని