Tiger Nageswara Rao: ‘మాటిస్తున్నా.. గర్వపడే చిత్రాలు చేస్తా’: దర్శకుడు భావోద్వేగం

‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల దర్శకుడు వంశీ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను గొప్ప చిత్రాలు తీస్తానని మాటిచ్చారు.

Published : 22 Oct 2023 14:23 IST

హైదరాబాద్‌: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఇందులో పాల్గొన్న దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు. భవిష్యత్తులో తాను గొప్ప చిత్రాలు తెరకెక్కిస్తానని రవితేజకు మాటిచ్చారు. ‘‘నా కెరీర్‌లో ఇదే పెద్ద సినిమా. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని వివరిస్తూ వాళ్లు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా విషయంలో నన్నెంతో నమ్మి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిత్ర నిర్మాతలు, నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు. రవి సర్‌.. ఈ ప్రయాణం ఇంతటితో ఆగిపోలేదు. స్క్రిప్ట్ పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నప్పుడు మీరే నాకు ఈ ప్లాట్‌ఫామ్‌ ఇచ్చారు. ఈ రోజు నేను మీకు మాటిస్తున్నా. వీడు నావాడు అని మీరు గర్వించేలా సినిమాలు చేస్తా’’ అని వంశీ అన్నారు.

అనంతరం రవితేజ మాట్లాడుతూ.. చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించి వర్క్ చేశారని అన్నారు. ‘‘దర్శకుడు వంశీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేశాడు. అతడు ఇంత చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలడని అస్సలు ఊహించలేదు. అతడు మంచి టాలెంట్‌ ఉన్న వ్యక్తి. మా ఇద్దరి కాంబోలో మరెన్నో చిత్రాలు రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకో విషయం ఏమిటంటే.. విక్రమ్‌ రాథోడ్‌ పాత్ర తర్వాత నాకు విపరీతమైన సంతృప్తిని ఇచ్చిన పాత్ర ఇదే’’ అని రవితేజ తెలిపారు.

నాకు జాతీయ అవార్డు రావాలని ఆయన బలంగా కోరుకున్నారు: అల్లు అర్జున్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. వంశీ దర్శకుడు. ‘అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌’పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 3.02 గంటల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. కథా, కథనం, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉందని సినీ ప్రియులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్రబృందం రన్‌టైమ్‌ను 2.37 గంటలకు తగ్గించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని