Tillu Square: ‘టిల్లు 3’ని త్వరలోనే ప్రకటిస్తాం

‘‘ప్రేక్షకులు టిల్లు పాత్ర అనగానే హాస్యాన్నే ఆశిస్తారు. అందుకే హాస్యం ప్రధానంగానే స్క్రిప్ట్‌ రాశా.

Updated : 30 Mar 2024 11:49 IST

‘‘ప్రేక్షకులు టిల్లు పాత్ర అనగానే హాస్యాన్నే ఆశిస్తారు. అందుకే హాస్యం ప్రధానంగానే స్క్రిప్ట్‌ రాశా. థియేటర్లలో ప్రేక్షకులు కథ గురించి పట్టించుకోకుండా వినోదాన్నే ఆస్వాదిస్తున్నారు. విడుదలకి ముందే ఈ సినిమా అదిరిపోతుందని తెలుసు. విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచే ఆ మాట వినడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్లతో ముచ్చటించింది. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘స్క్రిప్ట్‌ స్థాయిలో అర్థం కాని సినిమాలు ఇవి. తొలి భాగం తీస్తున్నప్పుడే నన్ను నమ్మి అత్యున్నత ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. రెండో భాగం ‘టిల్లు స్క్వేర్‌’ విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నటుడి కంటే ముందు ఈ సినిమాకి  రచయితని నేను. రాసేటప్పుడు చాలా నిజాయతీగా ఉండాలి. ఎక్కువ, తక్కువలు కాకుండా ప్రతి పాత్రని రాశాం. అందుకే పాత్రలు అంత బాగా పండాయి. అనుపమ వంద శాతం ఊహిస్తే, తన నటనతో వెయ్యి శాతం ప్రభావం చూపించింది. ఇందులో కథ ఎంత ఉండాలో అంత ఉంది’’ అన్నారు.

అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. ఇలాంటి పాత్రని పోషించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ పాత్ర విషయంలో చాలా సందేహాలు ఉండేవి. సినిమాకి లభిస్తున్న స్పందన ఎంతో తృప్తినిచ్చింది’’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘‘తొలి షో నుంచే మంచి టాక్‌ వచ్చింది. రానున్న రోజుల్లో సెలవులు కూడా కలిసొస్తాయి. తప్పకుండా ఈ చిత్రం రూ.వంద కోట్లు వసూళ్లు సాధిస్తుందని నమ్మకం ఉంది. మూడో భాగాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఆట ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదిస్తున్నార’’ని చెప్పారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌ శంకర్‌, రవి ఆంథోనీ, ప్రణీత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని