Tollywood: ప్రేమలో పడ్డారు.. లవ్‌ స్టోరీతో..

ఒకప్పుడు మన సినిమాల్లో  ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి

Updated : 24 Apr 2024 11:58 IST

 

ఒకప్పుడు మన సినిమాల్లో  ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి. కొన్నాళ్లుగా వాళ్లూ యాక్షన్‌ కథలపై మక్కువ ప్రదర్శిస్తూ వస్తున్నారు. దాంతో ప్రేమకథలకి విరామం వచ్చినట్టైంది. అలాగని బొత్తిగా ప్రేమ ఊసులు లేకపోలేదు. అప్పుడప్పుడూ ప్రేమలోని మాధుర్యాన్ని గుర్తు చేస్తూ అలరిస్తుంటాయి మన సినిమాలు. 2022లో ‘సీతారామం’, 2023లో ‘బేబి’ చిత్రాలు సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్లీ మన చిత్రసీమ ప్రేమలో పడుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రేమకథలు తెలుగు తెరకు కొత్త కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచీ వస్తూనే ఉన్నాయి. అప్పుడూ ఇప్పుడూ ప్రేమ అదే. కానీ ప్రేక్షకుడిని  సరికొత్తగా  అలరిస్తూ వస్తోంది. ప్రేమలో ఉన్న గొప్పదనమే అది. అందుకే దర్శకులు వీలు కుదిరినప్పుడల్లా ప్రేమకథలతో స్క్రిప్టులు సిద్ధం చేస్తుంటారు.  ప్రేమ చుట్టూ తిరిగే సినిమాలు భవిష్యత్తులో చాలానే రాబోతున్నాయి. ప్రభాస్‌ మొదలుకొని ఆనంద్‌ దేవరకొండ వరకూ పలువురు కథానాయకులు ప్రేమకథలతో మురిపించనున్నారు.


చారిత్రక కథలో...?

ప్రేమకథలపై తనదైన ముద్ర వేశారు హను రాఘవపూడి. ఆయన తొలి చిత్రం ‘అందాల రాక్షసి’ మొదలుకొని ‘సీతారామం’ వరకూ ఆయన సినిమాల్లో ప్రేమని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. ఈసారి ప్రభాస్‌ని ఆయన ఓ చారిత్రక ప్రేమకథలో చూపించనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించి స్క్రిప్ట్‌ సిద్ధమవుతోంది. యు.వి.క్రియేషన్స్‌ నిర్మించనున్న ఆ సినిమా ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనుందని సమాచారం. నాగచైతన్య - చందూ మొండేటి కలయికలో రూపొందుతున్న ‘తండేల్‌’ కూడా ప్రేమకథతోనే రూపొందుతోంది. భారత్‌ - పాక్‌ మధ్య సాగే కథ ఇది. ప్రేమ, సముద్రం నేపథ్యం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య ఉత్తరాంధ్రకి చెందిన  మత్స్యకారుడిగా కనిపించనున్నారు.  


తెలుసు కదా...

ప్రముఖ నిర్మాణ సంస్థలు అగ్ర హీరోలతో ఒకపక్క యాక్షన్‌ ప్యాక్డ్‌ సినిమాలు చేస్తూనే... మరోవైపు వినూత్నమైన ప్రేమకథల్ని తెరకెక్కించడంపైనా దృష్టిపెట్టాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ప్రేమ, హాస్యం మేళవింపుతో అశోక్‌ గల్లా కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తోంది. ఉద్భవ్‌ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి కెప్టెన్‌.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రముఖ స్టైలిష్ట్‌ నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘తెలుసు కదా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతున్నట్టు సమాచారం. మరికొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ప్రేమకథల్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘‘పాన్‌ ఇండియా ట్రెండ్‌ వల్ల చాలా మంది కథానాయకులు యాక్షన్‌ కథలపైనే మొగ్గు చూపుతున్నారు. దాంతో ప్రేమకథల జోరు తగ్గింది. భవిష్యత్తులో మళ్లీ ప్రేమకథల ట్రెండ్‌ మొదలవుతుంద’’ని పలువురు దర్శకులు అభిప్రాయ పడుతున్నారు.


‘బేబి’ కలయికలో...

‘బేబి’ సినిమాతో తెలుగు పరిశ్రమకి దొరికిన నయా ప్రేమికుడు ఆనంద్‌ దేవరకొండ. ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేశ్‌ రాసిన కథతోనే... ఆనంద్‌, వైష్ణవి జంటగా మరో కొత్త ప్రేమకథ తెరకెక్కుతోంది. రవి నంబూరి దర్శకుడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. భవిష్యత్తులో మా నుంచి మరికొన్ని ప్రేమకథలు వస్తాయని దర్శకుడు సాయిరాజేశ్‌ చెప్పారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ నుంచి  ‘లవ్‌ మీ’ అంటూ మరో కొత్త రకమైన ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రమిది. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. దెయ్యంతో ముడిపడిన ప్రేమకథ ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని