Tollywood: మనసంతా.. ఫాంటసీ

చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు..

Updated : 20 Apr 2024 12:09 IST

అగ్రతారల నుంచి యువతారల వరకూ ఇదేమాట 

చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. చూపు తిప్పుకోనివ్వకుండా చేసే గ్రాఫిక్స్‌ హంగులు.. సాహసోపేతమైన విన్యాసాలతో కట్టిపడేసే హీరోయిజం.. ఇలా ఎన్నో వాణిజ్య హంగులకు చిరునామాగా నిలిచే చిత్రాలివి. అందుకే వీటికి పాన్‌ ఇండియా స్థాయిలోనే కాక ప్రపంచవ్యాప్తంగానూ మంచి గిరాకీ ఉంటుంది. నిజానికివి భారీ బడ్జెట్లను డిమాండ్‌ చేసే కథలైనా సరే.. ప్రేక్షకుల మెప్పు పొందాయంటే చాలు అంతకు రెట్టింపు వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటాయి. ఇప్పుడీ తరహా ఫాంటసీ థ్రిల్లర్లతోనే బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించేందుకు పలువురు తారలు సిద్ధమవుతున్నారు. అందులో కొన్ని సినిమాలు ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకోగా.. మరికొన్ని పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన సినిమాల్లో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ల వాటానే ఎక్కువ. ‘బంగార్రాజు’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’, ‘హను-మాన్‌’, ‘ఊరు పేరు భైరవకోన’.. ఇలా అనేక విజయాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడీ తరహా కథలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు పలువురు అగ్రతారలు సిద్ధమవుతున్నారు. చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేకంగా గుర్తుండిపోయే సోషియో ఫాంటసీ చిత్రాల్లో ‘అంజి’కి ప్రత్యేకమైన స్థానముంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ, ఆ తర్వాత చిరు నుంచి మళ్లీ ఆ తరహా సినిమా రాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ‘విశ్వంభర’ రూపంలో మరో సరికొత్త ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ‘బింబిసార’తో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. పంచభూతాలతో ముడిపడి ఉన్న కథగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ముల్లోకాలతో ముడిపడిన అంశాలు ఉంటాయని టాక్‌. దీనికోసం ఓ ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. అవన్నీ సినీప్రియులకు కొత్త అనుభూతి పంచిస్తాయని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘కల్కి 2898ఏడీ’ అనే సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంతో త్వరలో సినీప్రియుల్ని పలకరించనున్నారు ప్రభాస్‌. ఇక ఆ తర్వాత ఆయన నుంచి రానున్న సినిమా ‘ది రాజా సాబ్‌’. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఓ విభిన్నమైన రొమాంటిక్‌ ఫాంటసీ హారర్‌ థ్రిల్లర్‌గానే ఉండనున్నట్లు సమాచారం.ఈ సినిమా కోసం మారుతి కూడా తనదైన శైలిలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ పాన్‌ ఇండియా సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

ఈ జానర్లోనే సూపర్‌ హీరో..

ప్రస్తుతం ‘తండేల్‌’ చిత్రం కోసం సెట్స్‌పై తీరిక లేకుండా శ్రమిస్తున్నారు హీరో నాగచైతన్య. ఆయన తదుపరి సినిమా కార్తీక్‌ దండుతో ఖరారైన సంగతి తెలిసిందే. ఇది కూడా కార్తీక్‌ తొలి చిత్రం ‘విరూపాక్ష’ తరహాలోనే ఫాంటసీ అంశాలతో నిండిన మిస్టీక్‌ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆధ్యాత్మికతకు సైన్స్‌ను ముడిపెట్టి చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్‌ ‘కార్తికేయ 2’. నిఖిల్‌ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఫాంటసీ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ రానుంది. దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. రెండో భాగం కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ మూడో భాగం కొనసాగనుంది.

‘హను-మాన్‌’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు ‘మిరాయ్‌’ కోసం రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సూపర్‌ యోధ సినిమాలోనూ ఫాంటసీ అంశాలకు ప్రాధాన్యమున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో అర్థమైంది. ప్రస్తుతం ‘హను-మాన్‌’కు కొనసాగింపుగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆ తర్వాత ఆయన సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రానున్న సూపర్‌ హీరో సినిమాలన్నీ ఈ ఫాంటసీ జానర్లోనే సాగనున్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్‌ వర్మ గతంలోనే ప్రకటించారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నుంచి ఓ కొత్త కబురు బయటకొచ్చింది. కౌశిక్‌ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. ఇది కిష్కిందపురి అనే ఓ ఫాంటసీ ప్రపంచంలో సాగే హారర్‌ మిస్టరీ కథగా ఉంటుందని సమాచారం. దీని చిత్రీకరణ త్వరలో మొదలు కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని