Iswarya Menon: అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు

‘‘అవకాశాలు... విజయాల కంటే కూడా ప్రేక్షకుల స్వీకరణ ముఖ్యం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా. ఇప్పటి నుంచి తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నా’’ అంటోంది ఐశ్వర్య మేనన్‌.

Published : 28 May 2024 01:17 IST

‘‘అవకాశాలు... విజయాల కంటే కూడా ప్రేక్షకుల స్వీకరణ ముఖ్యం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందడం కోసం ప్రయత్నిస్తున్నా. ఇప్పటి నుంచి తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నా’’ అంటోంది ఐశ్వర్య మేనన్‌. దక్షిణాదిలోని నాలుగు ప్రధాన భాషల్లో నటిస్తున్న కథానాయిక ఈమె. ‘స్పై’ సినిమాతో పరిచయమైంది. ఇటీవల ‘భజే వాయు వేగం’ సినిమాలో నటించింది. కార్తికేయ కథానాయకుడిగా... ప్రశాంత్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. యు.వి.కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఐశ్వర్య మేనన్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

‘‘తెలుగులో నా రెండో సినిమాగా ‘భజే వాయు వేగం’ విడుదలవుతున్నప్పటికీ... ‘స్పై’ కంటే ముందే ఈ సినిమాకి సంతకం చేశా. నేను తెలుగు సినిమాలకి బాగుంటానని, తన కథలోని ఇందు పాత్రకీ సరిపోతానని నమ్మి నన్ను సంప్రదించారు. ఒక రకంగా నన్ను టాలీవుడ్‌కి పరిచయం చేసింది ప్రశాంత్‌ రెడ్డి అనుకోవాలి. ఆయన ఫోన్‌లోనే ‘భజే వాయు వేగం’ స్క్రిప్ట్‌ చెప్పారు. కథతోపాటు, అందులో నా పాత్ర కూడా చాలా నచ్చింది. ఇందు అనే ఓ బ్యూటిషియన్‌ పాత్ర నాది. సంప్రదాయ బద్ధంగా కనిపించే ఓ అందమైన అమ్మాయి ఇందు. స్వతహాగా నాకు మన సంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్ని ధరించడానికే ఇష్టపడతా. అలాంటి పాత్రే నాకు దొరకడంతో వెంటనే అంగీకారం తెలిపా’’. 

  • ‘‘కథానాయికలు కమర్షియల్‌ హీరోయిన్‌ అనే పేరు తెచ్చుకోవడం ముఖ్యమే. అదే సమయంలో నటనకి ప్రాధాన్యమున్న పాత్రలూ చేయాలనేది నా ఆలోచన. ఆడిపాడేందుకే అన్నట్టుగా అలా వచ్చి ఇలా వెళ్లిపోయే తరహా పాత్రల కంటే,  కథలో ప్రాధాన్యం ఉండే పాత్రలంటేనే ఇష్టం. ‘భజే వాయు వేగం’ సినిమాలో అలాంటి పాత్రే నాకు దక్కింది. యాక్షన్, భావోద్వేగాలు ఈ సినిమాకి ప్రధానబలం. కథానాయకుడు వెంకట్‌ కోసం ఏం చేయడానికైనా వెనకాడని అమ్మాయి ఇందు. ఆమె వెంకట్‌ కోసం ఏం చేసిందనేది తెరపైనే చూడాలి. కార్తికేయతో కలిసి నటించడం మంచి అనుభవం. తన ‘ఆర్‌.ఎక్స్‌.100’ సినిమాని చూశాక, ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఆ అవకాశం ఈ సినిమాతో లభించింది. అందరితో స్నేహంగా మెలుగుతుంటారు కార్తికేయ. ఎంతో గొప్ప పేరున్న యు.వి సంస్థలో సినిమా చేయడం గర్వంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి ఎంతో స్పష్టత ఉన్న దర్శకుడు. ఆయన ప్రతిభ ఎలాంటిదో తెరపైనే చూస్తారు’’.  
  • ‘‘చిత్ర పరిశ్రమలో పసిపాప అడుగులు వేసినట్టుగా నా ప్రయాణం సాగుతోంది. చదువుకునే వయసులోనే అవకాశాలు వచ్చాయి. ఇంజినీరింగ్‌ అయిపోయాక నటనే నా వృత్తి అనిపించింది. అలా ప్రయాణం మొదలు పెట్టిన నేను...సొంతంగానే పేరు తెచ్చుకున్నా. స్వతహాగా నేను భరతనాట్యం డాన్సర్‌ని. సినిమాల్లోనూ నృత్య ప్రధానమైన పాత్రలు, మంచి డ్యాన్స్‌ నంబర్లు చేయాలని ఉంది. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అందులో ఓ సినిమాకి ఇప్పటికే సంతకం చేశా. తమిళంలో ఓ ప్రేమకథ చేస్తున్నా’’.
  • ‘‘స్పై’ కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఆ సినిమా తర్వాత నాకు తెలుగు నుంచి బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. నేనే కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నా. తెలుగులోనే కాకుండా, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నా. తెలుగుపైనే దృష్టి పెట్టినా... ఇతర భాషల నుంచీ ఆసక్తికరమైన కథలు వచ్చినప్పుడు వదులుకోలేం కదా. మలయాళంలో మమ్ముట్టి సర్‌తో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది.  తమిళంలోనూ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని