Ushakiran Movies: స్ఫూర్తిదాయకం.... నిర్మాణ దక్షతకు అద్దం

నిజ జీవిత వ్యక్తులు, యథార్థ సంఘటనలతో రూపొందించిన స్ఫూర్తిదాయక చిత్రాలతో ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ప్రతిష్ఠ మరింతగా పెరిగింది. రామోజీరావు నమ్మిన విలువలు, ఆయన నిర్మాణ దక్షతకి అద్దం పడతాయి ఆయా చిత్రాలు.

Updated : 09 Jun 2024 06:58 IST

నిజ జీవిత వ్యక్తులు, యథార్థ సంఘటనలతో రూపొందించిన స్ఫూర్తిదాయక చిత్రాలతో ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ప్రతిష్ఠ మరింతగా పెరిగింది. రామోజీరావు నమ్మిన విలువలు, ఆయన నిర్మాణ దక్షతకి అద్దం పడతాయి ఆయా చిత్రాలు. అందుకు ఉదాహరణే ఈ సంస్థ నుంచి వచ్చిన నాలుగో చిత్రం ‘మయూరి’, ఆ తర్వాత వచ్చిన ‘ప్రతిఘటన’. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ‘మయూరి’ చిత్రాన్ని నిర్మించారు. ప్రమాదంలో కాలును పోగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని ఈ సినిమాతో తెరపైకి తీసుకొచ్చారు. ప్రధాన పాత్రని సుధాచంద్రన్‌తోనే చేయించడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన స్ఫూర్తిమంతమైన ఆ చిత్రం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. సినిమా వచ్చి ఇన్నేళ్లయినా ‘మయూరి’ గురించి ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ ఇప్పటికీ చర్చ సాగుతూ ఉంటుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ అనగానే ‘మయూరి’ గుర్తుకొస్తుంది. సినిమా అంటే రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో విహరింపజేయడం మాత్రమే కాదని నిరూపించిన చిత్రమిది. హిందీలోనూ ‘నాచేమయూరి’గా పునర్నిర్మించారు రామోజీరావు. అక్కడ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. యమున, వినోద్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో మోహన్‌ గాంధీ రూపొందించిన ‘మౌనపోరాటం’తో నిజ జీవిత ఘటనలతో సినిమాల్ని రూపొందించడంలో తనదైన  ప్రత్యేకతని చాటి చెప్పింది ఉషాకిరణ్‌ మూవీస్‌. ఒడిశాలో అన్యాయానికి గురైన ఓ మహిళ జీవితమే స్ఫూర్తిగా రూపొందిన చిత్రమిది. ఆ సినిమా స్ఫూర్తితో ఎంతోమంది యువతులు సమాజంలో తమకు జరిగిన అన్యాయంపై మరింత ధైర్యంగా గళమెత్తారంటే ఆ ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని శక్తిమంతమైన పాత్రల్లో ఆవిష్కరించడంలోనూ... ఆ పాత్రలకంటూ ఓ  ఔచిత్యం ఉందని చాటడంలోనూ ముందుంటాయి ఉషాకిరణ్‌ మూవీస్‌ చిత్రాలు. అందుకు మరో ఉదాహరణ...   ‘ప్రతిఘటన’ చిత్రం. ఓ ధీరవనిత గాథతో రూపొందిన చిత్రమిది. విజయశాంతి కీలకపాత్ర పోషించగా, టి.కృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలోని ‘ఈ దుర్యోధన...’ పాటని ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పటికీ మహిళా ప్రధానమైన సినిమాలంటే గుర్తొచ్చేవాటిలో ‘ప్రతిఘటన’ ఒకటి. క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో స్ఫూర్తిదాయక చిత్రం...‘అశ్వని’. ఈ కథకి నిజ జీవితంలోనూ క్రీడాకారిణి అయిన అశ్వని నాచప్పని ఎంచుకున్నారు. క్రీడలు తప్ప మరో ప్రపంచం తెలియని ఆమెకి కథ, రామోజీరావు సంకల్పం నచ్చి కెమెరా ముందుకొచ్చారు. అప్పట్లో సంచలన విజయం సాధించిందీ చిత్రం. స్ఫూర్తిని రగిలించే చిత్రాలే కాకుండా... అప్పటి పరిస్థితులకి అద్దం పట్టే సామాజికాంశాలతో కూడిన చిత్రాలూ ఈ సంస్థలో రూపుదిద్దుకున్నాయి. ‘అమ్మ’, ‘జడ్జిమెంట్‌’, ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’ తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే. సామాజికాంశాలతో కూడిన పలు చిత్రాలు ఈ సంస్థలో తెరకెక్కాయి. సినిమా కళాత్మక వ్యాపారం అని నమ్మిన రామోజీరావు నిజ జీవిత కథలతోనే సినిమాలు తీసినా, వాటికి బలమైన వినోదం, సంగీతం మేళవింపజేస్తూ సినిమాలు నిర్మించారు. అందుకే అవి మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని