Varun Tej: అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు: వరుణ్‌ తేజ్‌

తన కొత్త సినిమా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రచారంలో బిజీగా ఉన్నారు వరుణ్‌ తేజ్‌. ఈసందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో.. సాయి పల్లవితో కలిసి మరో సినిమాలో నటించకపోవడంపై స్పందించారు.

Published : 27 Feb 2024 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫిదా’ (Fidaa) సినిమాలో కలిసి నటించి హిట్‌ జోడీగా నిలిచారు హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej), హీరోయిన్‌ సాయి పల్లవి (Sai Pallavi). అందులో ఎన్‌ఆర్‌ఐగా వరుణ్‌, తెలంగాణ అమ్మాయిగా పల్లవి విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తే బాగుండని చాలామంది అభిమానులు భావించారు. కానీ, ఇప్పటి వరకూ ఆ కాంబోలో మరో సినిమా రాలేదు. ఈ విషయంపై వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మళ్లీ తాము కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. ‘‘మా కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ మేరకు ఇద్దరం కథ విన్నాం. కానీ, ఈసారి చేస్తే ‘ఫిదా’ను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం’’ అని వివరించారు.

గతంలో తాను నటించిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రానికి సీక్వెల్‌ చేసే ఆలోచన ఉందన్నారు. ఓ మల్టీస్టారర్‌లో నటించే అవకాశం వచ్చినా కథ నచ్చకపోవడంతో చేయలేదని చెప్పారు. నితిన్‌, సాయిధరమ్‌ తేజ్‌లతో కలిసి ఓ మూవీలో నటించాలనుందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇండస్ట్రీలో నితిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. ఓ సినిమా హిట్‌ అయినా ప్లాఫ్‌ అయినా తదుపరి చిత్రానికి ఒకేలా కష్టపడతానని, ప్రతీ మూవీ ఫలితాన్ని విశ్లేషించుకుంటానని పేర్కొన్నారు. ‘గాండీవధారి అర్జున’ సినిమా ఫలితంపై స్పందిస్తూ.. అందులోని హీరో క్యారెక్టర్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ కాలేకపోయారేమో అని భావిస్తున్నానన్నారు.

వరుణ్‌ తేజ్‌ తాజా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. శక్తి ప్రతాప్‌సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్‌.. ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా నటించారు. మానుషి చిల్లర్‌ కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని