Vijay Sethupathi: హీరోగా విజయ్‌ సేతుపతి తనయుడు.. ఆసక్తికర టైటిల్‌తో...

పలు చిత్రాల్లో బాల నటుడిగా కనిపించిన విజయ్‌ సేతుపతి తనయుడు ఇప్పుడు హీరోగా మారాడు. ఈ సినిమా సంగతులివీ..

Updated : 24 Nov 2023 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) తనయుడు సూర్య (Surya) హీరోగా మారాడు. ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు (Anal Arasu) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అతడు కథానాయకుడిగా (Vijay Sethupathi Son) నటిస్తున్నాడు. ఆ సినిమా చెన్నైలో శుక్రవారం ప్రారంభమైంది. ‘ఫీనిక్స్‌’ (Phoenix) అనే టైటిల్‌ను పెట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్‌, స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బ్రేవ్‌మ్యాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సామ్‌ సి.ఎస్‌. సంగీతం అందిస్తున్నారు. వేల్‌రాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్‌ వివరాలు వెల్లడించలేదు. సూర్య మాట్లాడుతూ..‘‘మా నాన్న నీడలో నేను ప్రయాణించాలనుకోవడం లేదు. నాదైన దారిలో వెళ్లాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా మేకర్స్‌ ‘ఇంట్రడ్యూసింగ్‌ సూర్య’ అని అంటున్నారేగానీ ‘ఇంట్రడ్యూసింగ్‌ సూర్య విజయ్‌ సేతుపతి’ అని అనడం లేదు. నేను హీరోగా నటిస్తుండడంపై అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు’’ అని అన్నారు. ఈ సినిమాలోని హీరో పాత్ర ఫీనిక్స్‌ పక్షిని తలపించేలా ఉంటుందని, అందుకే ఆ పేరు పెట్టామని డైరెక్టర్‌ తెలిపారు.

విలన్‌ పాత్రలు చేయకూడదనుకుంటున్నా: విజయ్‌ సేతుపతి

అనల్‌ అరసు ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు. ‘శ్రీమంతుడు’, ‘బ్రూస్‌లీ’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’ తదితర తెలుగు చిత్రాల్లోని పలు యాక్షన్‌ సన్నివేశాలు అనల్‌ ఆధ్వర్యంలోనే తెరకెక్కాయి. ఇటీవల విడుదలైన కార్తి ‘జపాన్‌’, షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ చిత్రాలకూ ఆయన పనిచేశారు. సూర్యకు నటన కొత్తేమీ కాదు. తన తండ్రి హీరోగా తెరకెక్కిన ‘నేనూ రౌడీనే’, ‘సింధుబాద్‌’లో సూర్య నటించాడు. వెట్రిమారన్‌ తెరకెక్కిస్తోన్న ‘విడుదలై: పార్ట్‌ 2’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని