Vikram: ‘తంగలాన్‌’లో నాకు డైలాగులు లేవు.. అసలు విషయం చెప్పేసిన విక్రమ్‌

విక్రమ్‌ తాజా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). హైదరాబాద్‌లో నిర్వహించిన దీని టీజర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.

Published : 02 Nov 2023 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు ప్రముఖ కథానాయకుడు విక్రమ్‌ (Vikram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). పా రంజిత్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 26న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

‘‘తంగలాన్‌’లాంటి గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నా ఈవెంట్‌కు ఈ స్థాయిలో యూత్ రావడం ఇదే తొలిసారి. ఎప్పుడూ పెద్దవాళ్లు వచ్చి ఆశీర్వదిస్తారు. ‘తొమ్మిది నెలలు’ అనే సినిమా సమయంలో ఈ టీమ్‌తో కలిసి పని చేశాను. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం కలిసి పని చేశాను. నన్నెంతో ఆదరిస్తున్నందుకు అభిమానులందరికీ కృతజ్ఞతలు. ‘శివపుత్రుడు’, ‘నాన్న’, ‘అపరిచితుడు’.. ఇలాంటి చిత్రాల్లాగే ‘తంగలాన్‌’ కూడా ఓ విభిన్న కథతో మీ ముందుకొస్తోంది. ఇది మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు డైలాగులు లేవు. ‘శివపుత్రుడు’ తరహాలో ఉంటుంది’’

రామ్‌ చరణ్‌కు మరో గౌరవం.. ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో చోటు..

‘‘టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. దీనిలో అసలు గ్లామర్‌ అనేది ఉండదు. ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు. రొటీన్‌ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సినిమా అంతా లైవ్‌ సౌండ్‌లో చేశాను. అలా చేయడం ఎంతో కష్టం. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి తీసుకోకుండా చేశాం. ‘తంగలాన్‌’ తెగ వారు ఎలా జీవిస్తారో దాన్నే చిత్రీకరించాం. నా కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు. నా మీద నమ్మకంతో ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు మరో స్థాయికి వెళ్తారని నేను కచ్చితంగా చెప్పగలను. మీరు టీజర్‌లో చూసింది చాలా తక్కువ. థియేటర్లో ఈ సినిమా చూసే ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగుతుంది’’

‘‘ప్రస్తుతం సౌత్ సినిమాలు ప్రపంచస్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి. గతంలో ఇండియన్‌ యాక్టర్‌ అని చెప్పగానే ‘బాలీవుడ్‌’ నుంచి వచ్చారా అనే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సౌత్ ఇండస్ట్రీ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. దర్శకుడు అట్లీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ‘కేజీఎఫ్‌’,‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయి. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఆస్కార్‌ సాధించి మా అందరికీ ఒక దారి చూపారు’’ అని విక్రమ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని