కథ కలిపింది..ఇద్దరినీ!

హిట్టు మాట వినిపించి... స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే.

Updated : 19 May 2024 06:24 IST

కుర్రహీరోలతో స్టార్‌ నాయికల సందడి

హిట్టు మాట వినిపించి... స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకున్నారంటే చాలు.. ఇక ఆ తర్వాత సదరు నాయికల ప్రయాణమంతా అందుకు తగ్గట్లుగా సాగాల్సిందే. స్టార్‌ హీరో.. స్టార్‌ దర్శకుడు.. అగ్ర నిర్మాణ సంస్థ.. ఇలా తమ స్టార్‌డమ్‌కు తగ్గట్లుగానే కాంబినేషన్లను సెట్‌ చేసుకుని కెరీర్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొంతమంది స్టార్‌ భామలు కొత్త పంథాలో నడిచే ప్రయత్నం చేస్తుంటారు. కథలు డిమాండ్‌ చేసినట్లు అనిపిస్తే ఇమేజ్‌ను పక్కకు పెట్టి మరీ రంగంలోకి దిగిపోతుంటారు. ఫలితంగా సినీప్రియులకు కొన్ని భిన్నమైన కలయికల్ని చూసే అవకాశం దొరుకుతుంటుంది. ప్రస్తుతం ఇలా ప్రత్యేకమైన కలయికల్లో రూపుదిద్దుకుంటున్న సినిమాలు తెలుగులో కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడా జంటలు.. కథలు సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 

‘యానిమల్‌’ సినిమాతో హిట్టు కొట్టి జోరుమీదుంది కథానాయిక రష్మిక. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2: ది రూల్‌’, ‘సికందర్‌’, ‘కుబేర’ లాంటి భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే ఓవైపు సల్మాన్‌ ఖాన్, అల్లు అర్జున్, ధనుష్‌ లాంటి స్టార్లతో ఆడిపాడుతూనే మరోవైపు దీక్షిత్‌ శెట్టి, దేవ్‌ మోహన్‌ లాంటి కుర్ర తారలతోనూ తెర పంచుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ అనే రెండు నాయికా ప్రాధాన్య చిత్రాలున్న సంగతి అందరికీ తెలిసిందే. వీటిలో శాంతరూబన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘రెయిన్‌బో’. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో రష్మిక సరసన నటిస్తోంది మలయాళ యువ హీరో దేవ్‌ మోహన్‌. ఈ చిత్రంలో వీళ్లిద్దరి జంట.. కథ కథనాలు సినీప్రియుల్ని ఆశ్చర్యపరుస్తాయని చిత్ర వర్గాలు ఇది వరకే ప్రకటించాయి. ఇక రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్‌ రవీంద్రన్‌ రూపొందిస్తున్న మరో నాయికా ప్రాధాన్య చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. ఇందులోనూ రష్మికతో జోడీ కట్టనుంది కుర్ర హీరోనే. అతనే కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి. ‘దసరా’లో నానికి మిత్రుడిగా కనిపించి మెప్పించిన ఆయన.. ఇప్పుడిందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 

వీలు కుదిరితే చాలు

కథానాయిక కాజల్‌ కూడా కొన్నాళ్లుగా పంథా మార్చింది. ఓవైపు అగ్ర కథానాయకులతో జట్టు కడుతూనే అవకాశం వచ్చినప్పుడల్లా యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. ఆ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘కవచం’, ‘సీత’ చిత్రాల్లో నటించిందామె. ఇప్పుడు ‘సత్యభామ’ కోసం నవీన్‌చంద్రతో జోడీ కట్టింది. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే జంటే. వినూత్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌గా ముస్తాబైన ఈ సినిమాలో కాజల్‌ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనుంది. సుమన్‌ చిక్కాల తెరకెక్కించారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘డిస్కోరాజా’, ‘మాస్ట్రో’ చిత్రాలతో అందర్నీ అలరించింది నభా నటేష్‌. ఇప్పుడామె ‘డార్లింగ్‌’తో సినీప్రియుల్ని మురిపించేందుకు సిద్ధమవుతోంది. అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో నభా..ప్రియదర్శికి జోడీగా నటించడం విశేషం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ విభిన్నమైన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


సిరీస్‌ కోసం సుహాస్‌తో కీర్తి!

‘మహానటి’తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్‌. హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఇప్పుడు కథానాయకుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వస్తున్నారు సుహాస్‌. ఇప్పుడీ ఇద్దరి ప్రత్యేకమైన కాంబినేషన్‌లో ఓ వెబ్‌సిరీస్‌ రానుంది. అదే ఐవీ శశి తెరకెక్కిస్తున్న ‘ఉప్పు కప్పురంబు’. సంక్షోభంలో చిక్కుకున్న ఓ గ్రామ ప్రజలు దాని నుంచి ఎలా బయట పడ్డారన్నది ఈ సిరీస్‌ ప్రధాన ఇతివృత్తం. సెటైరికల్‌ కామెడీ డ్రామాగా ఉంటుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించుకోనున్న ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. 


భలే లాభం..

ఓ స్టార్‌ కథానాయిక కుర్ర హీరోతో కలిసి జోడీ కడుతుందంటే చాలు కచ్చితంగా ప్రేక్షకుల దృష్టి ఈ కలయికలపై పడుతుంటుంది. అది సినిమాకే కాదు.. సదరు నాయికలకూ లాభసాటి వ్యవహారమే. పారితోషికం ఎక్కువ దక్కించుకునే వీలుంటుంది. అలాగే యువహీరోలతో ఆడిపాడుతూ తామింకా కుర్ర భామలమే అనే సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. ఫలితంగా వాళ్ల కెరీర్‌ను మరింత పొడిగించుకునే ఆస్కారం దొరుకుతుంది. ఇటీవల కాలంలో ఈతరహా కలయికలు విరివిగా తెరపైకి రావడానికి మారిన ప్రేక్షకుల అభిరుచులే ప్రధాన కారణమంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని