Chetan Bharadwaj: స్వేచ్ఛనిస్తేనే కొత్తదనం

‘‘మాస్‌ అంశాలతో పాటు... అనుబంధాలతో కూడిన ఓ సున్నితమైన కోణం కూడా ‘హరోం హర’ కథలో ఉంది. ఆ రెండు రకాల భావోద్వేగాల్నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సంగీతం ఇవ్వడాన్ని ఓ సవాల్‌గా స్వీకరించి పనిచేశా’’ అన్నారు

Published : 06 Jun 2024 01:17 IST

‘మాస్‌ అంశాలతో పాటు... అనుబంధాలతో కూడిన ఓ సున్నితమైన కోణం కూడా ‘హరోం హర’ కథలో ఉంది. ఆ రెండు రకాల భావోద్వేగాల్నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ సంగీతం ఇవ్వడాన్ని ఓ సవాల్‌గా స్వీకరించి పనిచేశా’’ అన్నారు చేతన్‌ భరద్వాజ్‌. ‘ఆర్‌ఎక్స్‌ 100’ మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘గం గం గణేశా’ వరకూ పలు చిత్రాలకి స్వరాలు సమకూర్చిన యువ సంగీత దర్శకుడు ఈయన. ఇటీవల సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘హరోం హర’ చిత్రానికీ స్వరాలు మకూర్చారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చేతన్‌ భరద్వాజ్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘ప్రతిసారీ ఓ కొత్త రకమైన కథకు పనిచేసే అవకాశం లభిస్తోంది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలోనూ నాటుదనం ఉన్నప్పటికీ, గాఢమైన యాక్షన్‌ ఉన్న పీరియాడిక్‌ కథకి స్వరాలు సమకూర్చే అవకాశం ‘హరోం హర’ చిత్రంతోనే వచ్చింది. యాక్షన్‌ కోణంతోపాటు, భావోద్వేగాలు, విజువల్స్‌ కొత్తగా ఉంటాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సంగీతం సమకూర్చాల్సి వచ్చింది. ఓ గొప్ప అనుభూతిని పంచేలా విజువల్స్, సంగీతం సమకూరాయి’’. 

  • ‘‘దర్శకుడు జ్ఞానసాగర్‌ నాకు ‘సెహరి’ సినిమా నుంచీ పరిచయం. నేను ఇదివరకు చేయని కథే అయినా, నామీద పూర్తిగా నమ్మకం పెట్టారు. 1989లో జరిగే కథ ఇది. అప్పటి ఓ జీవితాన్ని నేటి యువతరానికి కొత్తగా, అలాగే ఆ కాలాన్ని చూసిన ప్రేక్షకులు తమని తాము చూసుకునేలా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. ఆయన  ఆలోచనల్ని అర్థం చేసుకుంటూ ఈ సినిమాకి పనిచేశా. ఇందులోని ప్రతి పాత్రకీ ఓ ప్రత్యేకమైన థీమ్‌ని డిజైన్‌ చేసుకుని స్వరాలు సమకూర్చా. సుధీర్‌బాబు తెరపై కనిపించే విధానం, ఆయన నటన, విజువల్స్‌ మరింత సహజంగా సంగీతం అందించడానికి తోడ్పాటునందించాయి. కల్యాణ్‌ చక్రవర్తి, భరద్వాజ్, హర్ష, వెంగీ రాసిన పాటలు గుర్తుండిపోతాయి’’.
  • ‘‘సంగీతంపై కొత్తతరం ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తోంది. ఒకే తరహా భావోద్వేగాలే అయినా సంగీతంతో కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లపై నమ్మకంతో అవకాశాన్ని, స్వేచ్ఛని ఇస్తే కొత్త రకమైన ప్రయత్నాలు వెలుగులోకి వస్తాయి. ఇదివరకు  ఇతను ఈ తరహా కథకి పనిచేయలేదు కదా అని వెనకడుగు వేస్తే ఫలితం ఏమీ ఉండదు. ‘హరోం హర’ తరహా కొత్త రకమైన ప్రయత్నం నేను చేశానంటే కారణం, దర్శకనిర్మాతలు నాపై నమ్మకం ప్రదర్శించడంతోనే. ప్రస్తుతం గోపీచంద్‌ - శ్రీనువైట్ల కలయికలో రూపొందుతున్న ‘విశ్వం’ సినిమాకి పనిచేస్తున్నా’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని