హుషారుగా తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్

Eenadu icon
By Nri News Team Published : 28 Oct 2025 21:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఫిలడెల్ఫియా: అమెరికాలోని ఫిలడెల్పియాలో తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి లేడీస్ నైట్ ఈవెంట్‌ హుషారుగా సాగింది. అక్టోబర్ 18న గ్లెన్మూర్లోని గ్రిఫిత్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది. సెలబ్రిటీలు లేకుండా మహిళలే ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా వారే నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 300మందికిపైగా హాజరై ఉల్లాసంగా, ఉత్సాహంగా సందడి చేశారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు ఈ కార్యక్రమం ఉపశమనం ఇవ్వడంతో పాటు కొత్త శక్తిని ఇచ్చేలా ఏర్పాట్లు చేయడం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సంగీతం, డీజే, కళ్లు చెదిరే నృత్య ప్రదర్శనలు, సరదా ఆటలు, స్టైలిష్‌ ఫ్యాషన్‌ షోలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పాటలు, నృత్యాలతోపాటు ర్యాంప్ వాక్ ప్రదర్శనలు హైలైట్‌గా నిలిచాయి. లేడీస్‌ నైట్‌ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఇది మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. శ్వేత కొమ్మోజి తన యాంకరింగ్‌తో అదరగొట్టగా.. గాయని శ్రావణి చిట్టా తన గాత్రంతో పాటలు పాడి అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు. తానా మిడ్-అట్లాంటిక్ ఉమెన్స్ కోఆర్డినేటర్ సరోజ పావులూరి, ఆమె బృందం ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. భవాని క్రోతపల్లి, మైత్రి రెడ్డి నూకల, బిందు లంక, మనీషా మేక, రమ్య మాలెంపాటి, రవీణ తుమ్మల, దీప్తి కోక, భవాని మామిడి, నీలిమ వొలెట్టి తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషిచేశారు. ఏటా తానా ఆధ్వర్యంలో మార్చిలో విమెన్స్ డే, అక్టోబర్‌లో లేడీస్ నైట్ వంటి కార్యక్రమాలు జరపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.  తానా బోర్డ్  డైరెక్టర్ రవి పొట్లూరి మార్గదర్శకత్వంలో ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ వేడుకలకు స్పాన్సర్లుగా నిలిచిన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.  

తానా అధ్యక్షుడు డాక్టర్‌ నరేన్‌ కొడాలి, బోర్డు డైరెక్టర్‌ రవి పొట్లూరి, మిడ్‌ అట్లాంటిక్‌ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్  సింగు, సతీష్ తుమ్మల తదితరులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. చక్కటి సంగీతం, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో సహకరించిన తానా మిడ్-అట్లాంటిక్ కోర్ టీమ్‌ ప్రతినిధులు సునీల్ కోగంటి, గోపి వాగ్వాల, మోహన్ మల్ల, కృష్ణ నందమూరి, సురేష్ యలమంచి, శ్రీకాంత్ గుడూరు, ప్రసాద్ క్రోతపల్లి, చలం పావులూరి, నాగరాజు చింతం, రంజిత్ కోమటి, మరియు రవి తేజ ముత్తులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు