AAP: తిహాడ్‌ జైల్లో 6 నెలలు.. ఆ సంకల్పాన్ని మరింత పెంచింది - సంజయ్‌ సింగ్‌

ఆరు నెలలు జైల్లో గడపడం.. తనలో ఎంతో మనోధైర్యాన్ని పెంచిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

Published : 05 Apr 2024 00:02 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఆప్‌ (AAP) ఎంపీ సంజయ్‌ సింగ్‌ (Sanjay Singh).. తాజాగా బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఆరు నెలలు జైల్లో గడపడం.. తనలో ఎంతో మనోధైర్యాన్ని పెంచడంతోపాటు అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న సంకల్పాన్ని మరింత పెంచిందని ఆయన చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తోపాటు మాజీ మంత్రులు మనీశ్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌లు త్వరలోనే విడుదల అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘‘అన్యాయం, అరాచకాలు, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతీసారి మా గళాన్ని వినిపించాం. రైతు సమస్యలు, ధరల పెరుగుదల, మణిపుర్‌ హింస, దిల్లీ సమస్యలపై పోరాటం చేశాం. మా పోరు మున్ముందూ కొనసాగుతుంది. ఈ పోరాటం ద్వారా నాలో విశ్వాసం, బలం మరింత పెరిగింది. జైల్లో చదివే అవకాశం వచ్చింది’’ అని ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు. సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయొద్దన్న పార్టీ వైఖరిని సమర్థించిన ఆయన.. ‘జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు’ అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రిని ఎల్జీ ఎన్నుకున్నారా? అని ప్రశ్నించారు.

చైనా మన భూభాగంలోకి చొచ్చుకొస్తే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే

‘‘ఉచిత విద్య, నీటి సదుపాయం, బస్సు సర్వీసులు, యువతకు ఉపాధి కోసం దిల్లీలోని రెండు కోట్ల ప్రజలు కేజ్రీవాల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. కేవలం భాజపా డిమాండ్‌ చేస్తోందన్న కారణంతో రాజీనామా చేయాలా? అలా అయితే.. ఆ పార్టీ నేతలు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లను కూడా అరెస్టు చేసి.. రాజీనామా చేయమని అడుగుతారు. ఏ ప్రతిపక్ష పార్టీనీ వదలరు. ఇదే జరిగితే ప్రజాస్వామ్యం మిగలదు. ప్రజల ఆదేశాలకు విలువ ఉండదు’’ అని సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు