Lok Sabha Polls: చైనా మన భూభాగంలోకి చొచ్చుకొస్తే.. మోదీ నిద్రపోతున్నారు: ఖర్గే

చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్న సమయంలో మోదీ నిద్రపోతున్నారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు.

Published : 04 Apr 2024 20:05 IST

జైపుర్‌: లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిన సమయంలో మోదీ నిద్రపోతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లోని చిత్తోరగఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఖర్గే..  అవాస్తవాలు చెప్పేవారికి మోదీ ఓ సర్దార్‌ అన్నారు.  దేశం కోసం ఆయన ఆలోచించడం లేదని, కేవలం గాంధీ కుటుంబాన్ని దూషిస్తుంటారన్నారు. ‘నాకు 56 అంగుళాల ఛాతీ ఉంది, నేను భయపడను’ అని ప్రధాని చెబుతుంటారని..  మరి భయం లేకపోతే భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొస్తున్న సమయంలో నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయారా? అని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశం గురించి ఆలోచించడం లేదని ఖర్గే విమర్శించారు. ఆయనకు కేవలం గాంధీ కుటుంబాన్ని దూషించడమే పని అన్నారు. దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేసి తన వెంట తీసుకెళ్లాలని అనుకొంటున్నారన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ప్రధాని లేదా మంత్రులు కాలేదని ఖర్గే గుర్తుచేశారు. అయినా సరే వారసత్వ రాజకీయాలంటూ మోదీ మాట్లాడుతుంటారన్నారు. గాంధీ కుటుంబసభ్యులు ఈ దేశం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారన్నారు.  ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తారు. ఎన్నికల సమయంలో దేశమంతా తిరుగుతారు గానీ, అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌కు మాత్రం ఇంతవరకు వెళ్లలేదని ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని