Atishi: అవినీతి కేసు బూచితో మాలీవాల్‌ను కుట్రలో భాగం చేశారు

తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్‌ ఆరోపించింది.

Updated : 19 May 2024 02:38 IST

భాజపాపై ఆప్‌ నేత ఆతిశీ ఆరోపణ

దిల్లీ: తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్‌ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ సీనియర్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై ఆతిశీ స్పందిస్తూ..మాలీవాల్‌పై కుమార్‌ ఫిర్యాదు చేసి 24 గంటలైనా ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని విమర్శించారు. దిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. సంఘటన జరిగిన రోజున మాలీవాల్‌ను ముఖ్యమంత్రి కలుసుకోలేదని, లేదంటే ఆయనపైనే ఆరోపణలు వచ్చి ఉండేవని పేర్కొన్నారు.  ‘‘విపక్ష నేతలను వేధించడంలో భాజపాకు ఓ విధానం ఉంది. మొదట వారు నాయకులపై కేసులు పెడతారు. తరవాత వారిని జైలుకు పంపుతామంటూ బెదిరిస్తారు. అవినీతి నిరోధక విభాగం నమోదు చేసిన అక్రమ నియామకాల కేసును మాలీవాల్‌ ఎదుర్కొంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే మాలీవాల్‌ను భాజపా బెదిరింపులకు గురిచేసి కుట్రలో భాగం చేసింది’’ అని వివరించారు. దిల్లీ పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తుంటే కుమార్‌ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సూచించారు. అలాగే మాలీమాల్‌ ఫోన్‌ కాల్‌ రికార్డులను పరిశీలించి ఆమెతో సంప్రదింపులు నెరిపిన భాజపా నేతలెవరన్నది బయటపెట్టాలన్నారు. 


బిభవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు

స్వాతి మాలీవాల్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు, కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ను శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.  కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన దిల్లీ పోలీసు బృందం.. బిభవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌ను తరలించింది. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ముందస్తు బెయిల్‌ కోసం బిభవ్‌ కుమార్‌ తీస్‌ హజారీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా దిల్లీ పోలీసు తరఫు న్యాయవాది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదిస్తూ..కుమార్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని కోర్టుకు తెలియచేశారు. దీంతో నిందితుడి పిటిషన్‌ వ్యర్థమని కోర్టు పేర్కొంది. మరోపక్క బిభవ్‌ కుమార్‌ను ఏడు రోజుల తమ కస్టడీకి  అప్పగించాలంటూ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని