PM Modi: దక్షిణాది రాష్ట్రాలు ఎన్డీయేను ఆదరించాయి: మోదీ

PM Modi: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశ చర్రితలోనే తమది అత్యంత విజయవంతమైన కూటమిగా అభివర్ణించారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయం అందుకున్నామన్నారు.

Updated : 07 Jun 2024 20:05 IST

దిల్లీ: ‘ఎన్డీయే (NDA) అంటేనే సుపరిపాలన. మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుంది. మనది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం’ అని అన్నారు నరేంద్రమోదీ (PM Modi). ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం దిల్లీలో శుక్రవారం జరిగింది. ఇందులో తమ లోక్‌సభా పక్ష నేతగా మోదీని ఎన్డీయే నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు.

ఇక NDA అంటే అర్థమిదే..

‘‘గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని మూడుసార్లు పాలించింది. మరోసారి ఐదేళ్ల పాలనకు ప్రజలకు అవకాశమిచ్చారు. దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇది. ఎన్డీయే అంటేనే సుపరిపాలన. పేదల సంక్షేమమే మనందరి ప్రథమ కర్తవ్యం. దేశ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాం. వికసిత్‌ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుంది. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలి. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానం. అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాలే లక్ష్యం’’ అని మోదీ అన్నారు. ఇక NDA అంటే ‘న్యూ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు.

దక్షిణాదిలో బలం పెరిగింది.. 

‘‘దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారు. తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగుపెడుతున్నారు. అరుణాచల్‌, సిక్కింలో క్లీన్‌స్వీప్‌ చేశాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది’’ అని మోదీ కొనియాడారు.

పవన్‌ అంటే వ్యక్తి కాదు.. తుపాను: జనసేన అధినేతను కొనియాడిన మోదీ

ఇది ఎన్డీయే ఘన విజయం..

‘‘2024 ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. అయినా కూడా విపక్షాలు మన విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయి. మనం ఓడిపోయామని చిత్రీకరించాలని చూశాయి. కానీ, మనకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసు. ఎన్నికల ముందు ఈవీఎంలను కొందరు సందేహించారు. ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలయ్యాయి. ఇకనైనా విపక్షాలు పార్లమెంట్‌లోకి వచ్చి చర్చల్లో పాల్గొంటాయని భావిస్తున్నా’’ అని మోదీ చురకలంటించారు.

మరో పదేళ్లయినా కాంగ్రెస్‌ 100 దాటదు..

‘‘కాంగ్రెస్‌ చాలా వేగంగా పతనమవుతోంది. పదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్‌ హయాంలో వారి సొంత ప్రధానినే అవమానించారు. ఆయన నిర్ణయాలను లెక్క చేయలేదు. గత మూడు ఎన్నికల్లో వారికొచ్చిన స్థానాలు.. ఈ ఒక్క ఎన్నికల్లో మేం సాధించిన సీట్ల కంటే తక్కువే. మరో పదేళ్లయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్‌ను దాటలేదు’’ అని మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని