Govinda: శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

బాలీవుడ్‌ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated : 28 Mar 2024 18:34 IST

ముంబయి: బాలీవుడ్ సీనియర్‌ నటుడు గోవిందా (Govinda) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) బాలాసాహెబ్‌ భవన్‌లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివసేన (శిందే వర్గం) తరపున వాయువ్య ముంబయి లోక్‌సభ స్థానం నుంచి గోవిందా పోటీ చేయనున్నారు. శివసేన (శిందే వర్గం)అధికార ప్రతినిధి క్రిష్ణ హెగ్డే బుధవారం గోవిందాను ఆయన నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. గురువారం గోవిందా సీఎం శిందే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

2004 లోక్‌సభ ఎన్నికల్లో గోవిందా ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా సీనియర్‌ నాయకుడు రామ్‌ నాయక్‌ను ఓడించారు. తర్వాత కాంగ్రెస్‌కు, రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు. 2009 సహా తర్వాత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తాజాగా మరోసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వాయువ్య ముంబయి స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా అమోల్‌ కీర్తికర్‌ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో భాజపా - శివసేన (శిందే వర్గం) - ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీలు ‘మహాయుతి’ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.

‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్‌ గాంధీ భావోద్వేగ లేఖ

మరోవైపు, కాంగ్రెస్‌- శివసేన (యూబీటీ) - ఎన్సీపీ (శరద్‌ పవార్‌) పార్టీలు ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా.. వీటిలో 44 స్థానాలకు ఈ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్‌ 16, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. అయితే, తాము మొత్తం 22 స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ ముంబయిలో ఆరు స్థానాలను కోరుతుండగా.. సంజయ్‌ రౌత్‌ ప్రకటనపై ఆ పార్టీ అసహనంగా ఉన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని