Sobhana: కేంద్రమంత్రికి సినీనటి శోభన మద్దతు

సీనియర్‌ నటి శోభన ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు తన మద్దతు ప్రకటించారు.

Published : 15 Apr 2024 00:08 IST

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha elections) కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు సీనియర్‌ నటి శోభన (Sobhana) తన మద్దతు ప్రకటించారు. తిరువనంతపురం నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయనకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఆదివారం శోభన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం (ఏప్రిల్‌ 15న) జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే కార్యక్రమానికి తనకూ ఆహ్వానం అందిందని వెల్లడించారు. ఆమె మద్దతు పట్ల రాజీవ్‌ చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రేరణగా నిలిచిన నటి తనకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రగతి, అభివృద్ధికి అనుకూలంగా మార్పు రావాలని పలు వర్గాల ప్రజలు భావిస్తున్నారని.. ఇలాంటి ఐకాన్‌ల నుంచి మద్దతు పొందడం తనకెంతో గర్వంగా ఉందని తెలిపారు. వివిధ రంగాల నుంచి తనకు లభిస్తున్న మద్దతు ప్రధాని మోదీ (PM Modi) సారథ్యంలో గత పదేళ్లలో అందించిన పాలన పట్ల ఆమోదానికి సూచనగా పేర్కొన్నారు. 

ఆ సీఎం ఓ కీలుబొమ్మ.. అధికారం కల్పన చేతుల్లోనే: భాజపా నేత ఆరోపణలు

కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈసారి తిరువనంతపురం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌, సీపీఐ అభ్యర్థి పన్నయన్‌ రవీంద్రన్‌లతో తలపడుతున్న ఆయనకు శోభన మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది త్రిశ్శూరులో ప్రధాని మోదీ పాల్గొన్న భాజపా మహిళా సాధికారిత సభకూ శోభన హాజరయ్యారు. కేరళలో ఏప్రిల్‌ 26న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

సురేశ్‌ గోపీ, కేంద్రమంత్రులకు మోదీ ప్రచారం.. 

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 15న కేరళలో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహిస్తారు. త్రిశ్శూర్‌ జిల్లాలో అలత్తూరు నియోజకవర్గంలోని కున్నమంగళంలో సోమవారం ఉదయం త్రిశ్శూర్‌ అభ్యర్థి సురేష్‌ గోపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం తిరువనంతపురం జిల్లాలోని కట్టక్కడకు వెళ్తారు. అక్కడ బరిలో ఉన్న కేంద్రమంత్రులు వి.మురళీధరన్‌, రాజీవ్‌చంద్రశేఖర్‌లకు మద్దతు ప్రచారంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని