Odisha: ఒడిశా కొత్త సీఎం ఎవరు?

ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ తొలిసారి ఓటమి పాలై రాజీనామా చేశారు.

Published : 07 Jun 2024 05:32 IST

రెండు రోజుల్లో నిర్ణయించనున్న భాజపా
దిల్లీ

ఒడిశాను 24ఏళ్లపాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ తొలిసారి ఓటమి పాలై రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రానున్న భాజపా కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒడిశా శాసనసభ ఎన్నికల్లో భాజపా 78 స్థానాల్లో విజయం సాధించింది. బిజద 51, కాంగ్రెస్‌ 14, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు. 24 ఏళ్ల తర్వాత ఒడిశాకు కొత్త వ్యక్తి ముఖ్యమంత్రిగా రానుండటం విశేషం.


ధర్మేంద్ర ప్రధాన్‌

సంబల్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ధర్మేంద్ర ప్రధాన్‌ ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. సంబల్‌పుర్‌లో బిజద అగ్ర నేత ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌పై లక్షా 19వేల 836 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు.


కాగ్‌ గిరీశ్‌ చంద్ర

ముఖ్యమంత్రి రేసులో కాగ్‌ గిరీశ్‌ చంద్ర   పేరు బలంగా వినిపిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్‌కు మొదటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆయన   బాధ్యతలు నిర్వహించారు.


ప్రతాప్‌ సారంగీ

మోదీ ఆఫ్‌ ఒడిశాగా పేరు గాంచిన ఎంపీ ప్రతాప్‌ సారంగీ 2019 ఎన్నికల్లో బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొంది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మోదీ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు.


బైజయంత్‌ పండా

ఒడిశాకు చెందిన మరో దిగ్గజ నేత, మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన కేంద్రపాడా ఎంపీ బైజయంత్‌ పండా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రస్తుత భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే వీరంతా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడంవల్ల ఒడిశా సీఎంగా కొత్తవారిని పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అగ్రనాయకత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు  మన్మోహన్‌ సమాల్‌ తెలిపారు.


సీఎం రేసులో ప్రముఖులు

భాజపా తరఫున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ మంత్రి జుయెల్‌ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పండా, భువనేశ్వర్‌ ఎంపీ అపరాజిత సారంగీ, బాలేశ్వర్‌ ఎంపీ ప్రతాప్‌ సారంగీ, కాగ్‌ గిరీశ్‌ చంద్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని