Nitish- Kejriwal: కేజ్రీవాల్‌తో నీతీశ్‌ భేటీ.. కేంద్రంపై ‘రాజ్యసభ ప్లాన్‌’!

ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు సాగుతోన్న వేళ.. బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌లు భేటీ అయ్యారు. దిల్లీలో ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం ‘ఆర్డినెన్స్‌’ తీసుకురావడంపై మండిపడుతూ.. ఈ విషయంలో కలిసి పోరాడతామని చెప్పారు.

Published : 21 May 2023 15:19 IST

దిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Polls 2024) నాటికి భాజపా (BJP)కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై (Opposition Unity) ఆయా పార్టీల నేతల మధ్య సమాలోచనలు సాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) ఆదివారం దిల్లీ (Delhi) సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)తో భేటీ అయ్యారు. బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి దిల్లీకి వెళ్లిన నీతీశ్‌.. కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌లా ఓ ‘రాజ్యసభ ప్లాన్‌ (Rajyasabha Plan)’ను నీతీశ్‌ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.

పాలనావ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పించేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకురావడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో నితీశ్‌ కుమార్ తనకు పూర్తి మద్దతు ప్రకటించారని, తాము కలిసి పోరాడతామని చెప్పారు. ‘దిల్లీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంపై అందరం కలిసి పోరాడతాం. భాజపాయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే.. రాజ్యసభలో బిల్లు రూపంలోని ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని సూచించా. ఇదే జరిగితే.. ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌లా అవుతుంది. 2024లో భాజపా తిరిగి అధికారంలోకి రాదనే సందేశం దేశమంతటా వెళ్తుంది’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటారని నీతీశ్‌ కుమార్ సైతం ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్టు దిల్లీ ప్రభుత్వానికి పని చేసే హక్కు ఇచ్చింది. దాన్ని ఎలా లాక్కోగలరు? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో మేం ‘ఆప్‌’తో ఉన్నాం. మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. వీలైనన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తాం’ అని నీతీశ్‌ అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది తగదని వ్యాఖ్యానించారు. దిల్లీ విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు.. ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని