Amit Shah: నాలుగేళ్ల జగన్‌ పాలనలో అంతా అవినీతి, కుంభకోణాలే: అమిత్‌ షా

 వైఎస్‌ జగన్‌ పాలనపై కేంద్ర హోం మంత్రి ఘాటు విమర్శలు చేశారు. విశాఖలో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Updated : 11 Jun 2023 20:26 IST

విశాఖపట్నం: రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం.. రైతుల ఆత్మహత్యల విషయంలో సిగ్గుతో తలదించుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని తెలిపారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భాజపా బహిరంగ సభకు అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలు

‘‘రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్టు జగన్‌ చెబుతున్నారు. జగన్‌ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. మోదీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్‌ ఫొటోలు వేసుకుంటున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రతి పేద వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్నాం. దేశ వ్యాప్తంగా 230 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాం. 2009 నుంచి 2014 వరకు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రూ.78వేల కోట్లు ఇచ్చారు. 2014-2019లో భాజపా అధికారంలోకి ఉన్నప్పుడు  రూ.2,70,000 కోట్లు ఇచ్చింది. తొమ్మిదేళ్లలో కేంద్రం సుమారు రూ.5లక్షల కోట్లు ఇస్తే ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది. కేంద్రం ఇచ్చిన నిధుల మేర రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందా? జగన్‌ పాలనలో విశాఖ అరాచకాలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా చెలరేగుతోంది. రాష్ట్రంలో జగన్‌ సర్కారు నాలుగేళ్లలో అవినీతి, కుంభకోణాలు తప్ప మరేం చేయలేదు. భాజపా అధికారంలోకి వచ్చేటప్పటికీ 4వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 11వేల కిలోమీటర్లకు పెరిగింది.  జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.3లక్షల కోట్లు ఖర్చుచేసింది.   ప్రధాని మోదీ.. సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-తిరుపతికి వందే భారత్‌ రైళ్లు ఇచ్చారు. విశాఖ రైల్వే స్టేషన్‌ను రూ.450 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలను స్మార్ట్‌ సిటీ నగరాలుగాకేంద్రం అభివృద్ధి చేస్తోంది.

ఏపీ నుంచి 20 లోక్‌సభ స్థానాలు భాజపా గెలవాలి: అమిత్ షా

పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12లక్షల కోట్ల అవినీతి జరిగింది. నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు.  మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగినా ఎవరిపైనా చర్యలు లేవు. తొమ్మిదేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశం పూర్తి అంతర్గత రక్షణలో ఉంది. పుల్వామాలో దాడి జరిగితే .. భారత సైన్యం పది రోజుల్లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేసి పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పింది. ప్రపంచంలో ఎవరికీ భారత సేనను గానీ, భారత సరిహద్దును కానీ టచ్‌ చేసే ధైర్యం లేదు. మోదీ వచ్చాక మన దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదమే వినిపిస్తోంది. 300 సీట్లతో మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. ఏపీ నుంచి 20 లోక్‌సభ స్థానాలు భాజపా గెలవాలి’’ అని అమిత్‌ షా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని