Amit Shah: 2జీ, 3జీ, 4జీ పార్టీలకు కాలం చెల్లింది: అమిత్‌ షా

కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలకు కాలం చెల్లిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. వెల్లూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Published : 11 Jun 2023 22:23 IST

వెల్లూర్‌: కాంగ్రెస్‌ (Congress) , డీఎంకే (DMK) పార్టీల కుటుంబ, అవినీతి రాజకీయాలకు కాలం చెల్లిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. ప్రజలు వాళ్లను తుంగలో తొక్కేసే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. వాటిని 2జీ, 3జీ, 4జీ పార్టీలుగా అభివర్ణించిన అమిత్‌షా.. వాళ్లందరినీ పక్కకు నెట్టి భూమి పుత్రుడైన అన్నమలైకి అధికారం కట్టబెట్టే సమయమొచ్చిందని చెప్పారు. భాజపా తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తమిళనాడులోని వెల్లూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడారు. ‘‘ డీఎంకే, కాంగ్రెస్‌లు 2జీ, 3జీ, 4జీ పార్టీలు. ఇక్కడ నేను 2జీ కుంభకోణం గురించి మాట్లాడటం లేదు. 2జీ అంటే రెండు తరాలు. డీఎంకేకు చెందిన మారన్‌ కుటుంబం రెండు తరాలపాటు అవినీతి రాజకీయాలు చేసింది. కరుణానిధి కుటుంబం మూడు తరాలు, గాంధీల కుటుంబం నాలుగు తరాలుగా అవినీతి రాజకీయాలకు పాల్పడుతోంది.’’ అని అమిత్‌ షా అన్నారు. ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్న రాహుల్‌గాంధీ నాలుగో తరం వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్‌ 370 రద్దు చేసి, జమ్ముకశ్మీర్‌ను పూర్తి స్థాయిలో భారత్‌లో అంతర్భాగం చేసిన సమయంలోనూ డీఎంకే, కాంగ్రెస్‌లు అడ్డుతగిలాయని అమిత్‌ షా గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలను మరిచిపోయి.. అక్కడ కూడా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క సంతకంతో యునైటెడ్‌ కశ్మీర్‌ను సాకారం చేశారని అన్నారు. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం మంచిదా? కాదా? కశ్మీర్‌ మనదా? కాదా?’ అంటూ సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. ‘‘ ఈ రెండు పార్టీలు ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించాయి. కానీ, ఆగస్టు5, 2019లో ఒక్క సంతకంతో యునైటెడ్‌ కశ్మీర్‌ సాకారమైంది.’’ అని అమిత్‌ షా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని