రాయ్‌బరేలీ మీ కుటుంబ స్థానమా?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్‌పుర్‌లో సభలో ఆయన ప్రసంగించారు.

Published : 18 May 2024 04:15 IST

ప్రజాస్వామ్యంలో కుటుంబానికి చోటులేదు: అమిత్‌ షా

రాయ్‌బరేలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్‌పుర్‌లో సభలో ఆయన ప్రసంగించారు. ‘ఇండియా కూటమి అంతా కుటుంబంపై ఆధారపడిందే. లాలూ తన కుమారుడిని, మమత తన మేనల్లుడిని ముఖ్యమంత్రుల్ని చేద్దామనుకుంటున్నారు. సోనియాగాంధీ తన తనయుడు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. రాయ్‌బరేలీ, అమేఠీ తమ కుటుంబ స్థానాలుగా ప్రియాంకా గాంధీ చెబుతున్నారు. ఈ సీటు ఏ కుటుంబానిదో కాదు. రాయ్‌బరేలీ, అమేఠీ ప్రజలు ఎవరిని కోరుకుంటే వారు పార్లమెంటుకు వెళ్తారు. కుటుంబ నియోజకవర్గంగా చెప్పుకొనేచోట 70 ఏళ్లలో కలెక్టర్‌ కార్యాలయమైనా నిర్మించలేకపోయారు. ఇది ప్రజాస్వామ్యం. కుటుంబానికి స్థానమే లేదు. అమేఠీ, రాయ్‌బరేలీ రెండూ భాజపా ఖాతాలో పడతాయి. సింగ్‌ 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. దానిని నేను హామీ. అది నా బాధ్యత’ అని అమిత్‌షా చెప్పారు.

270 మైలురాయి దాటేశాం 

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నాలుగు విడతల పోలింగ్‌లో భాజపా 270 సీట్ల మైలురాయి దాటేసిందని, 400 దాటడానికి పరుగులు తీస్తోందని  అమిత్‌షా చెప్పారు. శుక్రవారం ఒడిశాలోని రవుర్కెలాలో  సభలో ఆయన ప్రసంగించారు.ఝార్ఖండ్‌లోని రాంచీ రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

‘ప్లాన్‌ బి’ అవసరమే లేదు 

దిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు భాజపాకు రాకపోతే ప్రత్యామ్నాయ ప్రణాళిక (ప్లాన్‌-బి) ఏమిటని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు అమిత్‌షా బదులిస్తూ అలాంటి అవసరమే లేదన్నారు. ‘‘60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉంది. వారికి ఎలాంటి కులం లేదు. వయసుతో సంబంధం లేదు. మోదీకి 400 సీట్లు ఎందుకివ్వాలి అనేది వారికి తెలుసు. ప్లాన్‌-ఎ విజయావకాశాలు 60 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడే ప్లాన్‌-బి రూపొందించాలి. మాకు ఆ అవసరం లేదు’’ అని చెప్పారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు ప్రజలు ఓటేస్తే మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అనడం నిజమైతే అంతకు మించిన కోర్టు ధిక్కారం మరొకటి ఉండదని షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని