AP news: తీర ప్రాంతాన్ని దోచుకునేందుకు జగన్‌ కుట్ర: ఆనం

దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని.. దీనిపై జగన్‌ కళ్లు పడ్డాయని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు.

Updated : 16 Apr 2024 15:28 IST

అమరావతి: దేశంలో ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని.. దీనిపై జగన్‌ కళ్లు పడ్డాయని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీర ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చాలని చంద్రబాబు అనుకుంటే.. జగన్‌  మాత్రం ‘గేట్‌ వే ఆఫ్‌ జగన్‌’ గా మార్చారని విమర్శించారు. 2019లో జగన్‌ అధికారంలోకి రాగానే ఆయన కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని దుయ్యబట్టారు.

‘‘కబ్జా చేయాలనుకుంటే మొదట జగన్‌కు గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి. దీంతో ఆయన్ని రంగంలోకి దింపారు. విజయసాయిరెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో. ఈ సంస్థ జగన్‌కు బినామీగా వ్యవహరిస్తోంది. విజయసాయిరెడ్డి కూడా ఆయనకు బినామీనే. మంచి లాభాలతో ఉన్న కాకినాడ సీ పోర్టుపై మొదట జగన్‌ కళ్లు పడ్డాయి. 2019 నుంచి కేఎస్‌పీఎల్‌పై దాడి మొదలైంది. షేర్లు ఇవ్వాలని బెదిరించినా ఆ సంస్థ ఒప్పుకోలేదు. ఏటా రూ.300 కోట్లు లాభాల్లో ఉన్న కంపెనీ వాటా ఇవ్వబోమని తెగేసి చెప్పింది. దీంతో ప్రభుత్వానికి రూ.965.65 కోట్లు ఎగ్గొట్టిందని రిపోర్టు తెచ్చారు. విజయసాయిరెడ్డి వెళ్లి బెదిరిస్తే.. డబ్బు కడతామని ఆ సంస్థ చెప్పేసింది. ఇంత బెదిరించినా కేఎస్‌పీఎల్‌ లొంగలేదని మళ్లీ ఆడిట్‌కు ఆదేశించారు. షేర్‌ హోల్డర్లు, డైరెక్టర్లు, సీఈవోలను జైలుకు పంపిస్తామని బెదిరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వైకాపా అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తాం’’ అని ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని