ఉత్కంఠకు తెర నేడే
కొవ్వూరు, నరసాపురంలలో తొలి ఫలితం
భీమిలి, పాణ్యం ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యం
ఎంపీ స్థానాల్లో మొదట రాజమహేంద్రవరం, నరసాపురం
అమలాపురం స్థానం ఫలితం అన్నింటి కంటే చివర్లో
ఈవీఎంలలో ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాలు
మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఫలితాలపై స్పష్టత
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా
ఈనాడు - అమరావతి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీ కేంద్రంలో పోస్టల్ బ్యాలట్ లెక్కింపు కోసం సిద్ధం చేసిన టేబుళ్లు
మరికొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది. ఈవీఎంలలో దాగిన ఓటరు తీర్పు వెల్లడి కానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత అయిదు గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యంగా రానున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో జరుగుతుంది. అందుకు 9-10 గంటలు పట్టనుంది. లోక్‌సభ నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం, నరసాపురం స్థానాల ఫలితాలు తొలుత రానున్నాయి. ఈ స్థానాల్లో 13 రౌండ్లలో 5 గంటల వ్యవధిలో లెక్కింపు పూర్తికానుంది. అమలాపురం లోక్‌సభ స్థానం ఫలితం అన్నింటి కంటే ఆలస్యం కానుంది. అత్యధికంగా 27 రౌండ్లలో ఇక్కడ లెక్కింపు చేపట్టనున్నారు. పూర్తయ్యేందుకు 9-10 గంటల సమయం పట్టనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా దాదాపుగా ఫలితాలపై పూర్తి స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా వెలగపూడి సచివాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు కూడా పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తామన్నారు. కౌంటింగ్‌కు సంబంధించి ఆయన చెప్పిన మరిన్ని వివరాలివి..
- లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు వేర్వేరు కౌంటింగ్ హాళ్లలో జరుగుతాయి. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
- శాసనసభ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ఒకే కౌంటింగ్ హాలులో జరుగుతుంది. అందుకే తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. 30 నిమిషాల తర్వాత ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలట్, ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు సమాంతరంగా సాగుతుంది.
- పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్‌కు గరిష్ఠంగా 2.30 గంటల సమయం, ఈవీఎం ఓట్లకు ఒక్కో రౌండ్‌కు 20-25 నిమిషాల సమయం పడుతుంది.
- ఒక్కోరౌండ్‌లో ఒక్కో టేబుల్‌పై 500 చొప్పున పోస్టల్ బ్యాలట్‌లు లెక్కిస్తారు.
- పోస్టల్ బ్యాలట్ ఓట్లకు సంబంధించి ఫాం 13-ఏలో అటెస్టింగ్ అధికారి సంతకముంటే చాలు అది చెల్లుబాటవుతుంది. హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదు. అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారు కాబట్టి.. ఆ సంతకంపై అభ్యంతరం తెలపడానికి అవకాశం లేదు.
భద్రతా దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లు 67 వేలమందికి పైగా ఉండగా.. వారికి సంబంధించి సోమవారం వరకూ 26,721 ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌ఫర్డ్ పోస్టల్ బ్యాలట్లు అందాయి. మంగళవారం ఉదయం 8 గంటల్లోగా పోస్టల్ ద్వారా అందే ఓట్లనూ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఈఓ ముకేశ్ కుమార్ మీనా
మర్యాద తప్పితే జైలుకే
- కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే వాటిని నిర్దేశిత పద్ధతిలో తెలియజేయాలి. మర్యాదగా వ్యవహరించాలి. అలా కాకుండా అల్లర్లు చేసేందుకు, గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని 53(4) సెక్షన్ కింద వారిని కౌంటింగ్ హాలు నుంచి బయటకు పంపించేస్తారు. కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తారు.
- తుది ఫలితాలు సిద్ధం చేస్తున్న సమయంలో ఎవరికైనా సందేహాలుంటే రీ కౌంటింగ్ కోరవచ్చు. అయితే అందుకు సహేతుక కారణం చూపించాలి. ఆ కారణం పట్ల రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందాలి.
ప్రతి పోస్టల్ బ్యాలట్ టేబుల్ వద్ద ఒక ఏఆర్‌వో
- ఈవీఎం ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్‌వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
- పోస్టల్ బ్యాలట్ లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ దగ్గర ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు.
- 18 ఏళ్లు పైబడిన ఎవరినైనా సరే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవచ్చు. ప్రతి టేబుల్‌కు ఒక ఏజెంటును నియమించుకోవచ్చు. మంత్రులు, మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండకూడదు.
- రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద అభ్యర్థి లేదా వారి తరఫు ప్రతినిధి ఉండొచ్చు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాల ప్రాంగణంలో పోస్టల్ బ్యాలట్ల లెక్కింపునకు సిద్ధం చేసిన టేబుళ్లు
1,985 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
- మంగళవారం మద్యం దుకాణాలు మూసేయాలి. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు అక్కడి పరిస్థితుల రీత్యా రెండు, మూడు రోజుల పాటు మూసివేతకు వారి విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 1,985 సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించాం. సమస్యలు సృష్టించే అవకాశమున్న 12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశారు.
- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. మొదటి అంచెలో కేంద్ర బలగాలు, రెండో అంచెలో ఏపీఎస్పీ, మూడో అంచెలో సివిల్ పోలీసులు ఉంటారు.
- కౌంటింగ్ కోసం 25 వేల మంది సిబ్బందిని వాడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 45 వేలమంది పోలీసులు ఉన్నారు. వీరంతా మంగళవారం నాడు ఎన్నికల విధుల్లోనే ఉంటారు.
- కౌంటింగ్ సందర్భంగా భద్రత, బందోబస్తు కోసం రాష్ట్రానికి 25 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 67 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి.
- సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలుంటాయి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.








