Anurag Thakur: అదో అహంకార, అవకాశవాదుల కూటమి: అనురాగ్‌

ఇండియా కూటమిపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదో అహంకారులు, అవకాశవాదుల కూటమి అన్నారు.

Published : 17 Sep 2023 17:18 IST

శిమ్లా: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) మండిపడ్డారు. దీన్నిబట్టే ఆ కూటమికి ఒక సిద్ధాంతం గానీ, నాయకుడు గానీ లేనట్టు అర్థమవుతోందన్నారు. విపక్ష కూటమి అహంకారులు, అవకాశవాదుల కలయిక అని.. సనాతన ధర్మానికి హాని కలిగించే లక్ష్యంతో ఉందని ఆరోపించారు.  ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పుట్టిన రోజు సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అనురాగ్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ ద్వారా దేశం సమయం, డబ్బును ఆదా చేయాలని ఇండియా కూటమి కోరుకోవడంలేదని.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారన్నారు. విపక్ష కూటమి నేతలు నాలుగుసార్లు సమావేశమైనప్పటికీ ఒక నేతను గానీ, కన్వీనర్‌ను గానీ నియమించలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. 

‘జమిలి’ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం

విపక్ష కూటమి వేషధారణ మాత్రమే మారింది తప్ప ప్రవర్తన, స్వభావం మాత్రం అలాగే ఉన్నాయని అనురాగ్‌ అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించేందుకు, ధ్వంసం చేసేందుకు పూనుకొన్న తమిళనాడులోని మీ కూటమి నేతలను చూడండంటూ కాంగ్రెస్‌ నేత పి.చిదంబరాన్ని కోరారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి నేతలు చెప్పకపోవడం దురదృష్టకరమన్నారు. విపత్తు సమయాల్లోనూ కాంగ్రెస్‌ రాజకీయాలకు పాల్పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుకు సొంత జిల్లా హమీర్‌పుర్‌లో మహిళపై ఇటీవల జరిగిన అకృత్యం హిమాచల్‌ప్రదేశ్‌కు అవమానకరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు