Purandeswari: ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి: పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.

Updated : 24 Oct 2023 16:43 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంచన కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని భారతీయ జనతా పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంగళవారం పురంధేశ్వరి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరిస్తూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, ముఖ్యంగా బేవరేజ్ కార్పొరేషన్ వంటి సంస్థల పైన కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ మేరకు నిర్మలా సీతారామన్‌కు ఇచ్చిన వినతి పత్రంలోని ప్రధాన అంశాలపై పురంధేశ్వరి ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఈ ఏడాది జులై 26న ఆర్థిక అవకతవకలు, అప్పటి వరకు చేసిన మొత్తం అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ తీరు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు మొత్తం రాష్ట్ర అప్పులపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేవలం ఆర్‌బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రూ.4.42 లక్షల కోట్ల అప్పులను మాత్రమే చెప్పింది. కార్పొరేషన్లు సహ ఇతర అవసరాలకు చేసిన అప్పులను ప్రస్తావించలేదు. ప్రభుత్వం చేస్తున్న అప్పులు, భవిష్యత్తులో కట్టలేక వచ్చే తిప్పల నుంచి బయట పడేయాలని రాష్ట్ర భాజపా చేస్తోన్న ప్రయత్నాలను ఈ ప్రభుత్వం తప్పుగా చిత్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, ఆస్తుల తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, ఇతర గ్యారంటీలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి. గత నాలుగు సంవత్సరాలుగా చేసిన పనులకుగాను గుత్తేదారులకు చెల్లింపులు చేయలేని దయనీయ స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారు.

ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున బ్యాంకుల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రజలు అడిగేది ఒక్కటే. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో బడ్జెట్, అకౌంటింగ్ విధానం అస్తవ్యస్తంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రం మీద ఉన్న మొత్తం అప్పు రూ.11 లక్షల కోట్లు. ఈ రుణం రాబోయే 30 సంవత్సరాల్లో తీర్చాలన్నా ఏడాదికి కనీసం రూ. 36 వేల కోట్లు అవసరమవుతుంది. ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ మరింత కష్టంగా మారుతుంది. మరోపక్క మద్యం ద్వారా సంవత్సరానికి వచ్చే రూ.30 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి రాకుండా మళ్లిస్తోంది.  రాష్ట్ర ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి’’ అని కేంద్ర మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో పురంధేశ్వరి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని