YS Sharmila: విజయవాడలో ఉద్రిక్తంగా ‘చలో సెక్రటేరియట్‌’.. షర్మిల బైఠాయింపు

మెగా డీఎస్సీ ప్రకటించాలన్న నినాదంతో ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

Updated : 22 Feb 2024 14:39 IST

విజయవాడ: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లోనే నిర్బంధించారు. ఆమె బయటకు రాకుండా భారీగా మోహరించారు. గురువారం పార్టీ కార్యాలయం వద్దకు రావాలని ప్రయత్నించిన నేతలు గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్‌వలీలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. 

పోలీసుల వైఖరిని నిరసిస్తూ షర్మిల సహా పలువురు నేతలు కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆంధ్రరత్న భవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ‘‘వైకాపా నియంత పాలనలో మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా నిలబడితే అరెస్టు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. 23వేల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 6 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి.

ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా?

రాష్ట్రంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం. 2.3 లక్షల జాబ్స్‌ ఇస్తామని జగన్‌ అధికారంలోకి వచ్చారు. 25వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు ఉంటే.. 7వేల ఉద్యోగాలూ ఇవ్వలేదని చంద్రబాబును నాడు అడగలేదా?ఆ మాటలు ఇవాళ మీకు వర్తించవా? నిరుద్యోగులపై మీకు దయ లేదా? మెగా డీఎస్సీ కాకుండా దగా డీఎస్సీ ఇచ్చారు. పట్టపగలే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చినవి. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చెప్పిన ఉద్యోగాలేవీ?

మేం నిరసనలు తెలపాలనుకుంటే ఎక్కడికక్కడ నియంత్రించారు. జర్నలిస్టులను చితకబాదుతున్నారు. ఇక్కడ ఏదైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తారా? పోలీసులను మీ బంటుల్లా వాడుకుంటారా?మీరేమైనా తాలిబన్లా?.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా?నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆందోళన చేస్తే భయమెందుకు? మేం ప్రజలకు దగ్గరవుతామనా? జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామన్నారు.. ఒక్క జాబ్ క్యాలెండరూ ఎందుకివ్వలేదు? ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 21వేల మంది మన రాష్ట్రంలో ఉపాధి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ పాపం ప్రభుత్వానిదే’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

చలో సచివాలయం నిర్వహించి తీరుతాం..

సీనియర్‌ నేత గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. ‘‘రాత్రి నుంచి పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. అక్రమంగా కేసులు పెడుతున్నారు. పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో షర్మిల దీక్ష చేస్తారు. చలో సచివాలయం నిర్వహించి తీరుతాం’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని